కాటు వేసిన పాముతోనే ఆసుపత్రికి..వైరల్ గా మారిన వీడియో

ఓ వ్యక్తి తనను కాటేసిన పామును చేతితో పట్టుకుని చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన ఘటన వైరల్ గా మారింది.

Update: 2024-10-16 12:27 GMT

దిశ, వెబ్ డెస్క్ :ఓ వ్యక్తి తనను కాటేసిన పామును చేతితో పట్టుకుని చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన ఘటన వైరల్ గా మారింది. బీహార్‌లోని భాగల్‌పూర్‌ జిల్లాలోని బరారి పంచాయతీ మీరాచక్ ప్రాంతవాసి ప్రకాష్ మండల్ ను ప్రమాదకరమైన పెంజర రకం( రస్సెల్స్ వైపర్)పాము కాటు వేసింది. బాధిత వ్యక్తి ఆ పాము మెడను పట్టుకుని తనతో పాటు తీసుకుని జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలోని మెడిసిన్ ఎమర్జెన్సీ విభాగానికి వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏ పాము కరిచిందన్న దానిపై స్పష్టత ఉంటే వైద్యులు సకాలంలో సరైన చికిత్స అందిస్తారన్న నమ్మకంతో ఆ పామును కూడా ఆసుపత్రికి తీసుకొచ్చినట్లుగా బాధితుడు చెప్పాడు. ప్రకాష్ మండల్ తన కుడి చేతితో పామును పట్టుకోగా ఎడమ చేతికి పాము కాటు వేసిందని తెలిపాడు.

కాగా వీడియోలో పాము విషం శరీరమంతటికి వ్యాపిస్తున్న క్రమంలో పాముతో ఆసుపత్రికి వచ్చిన బాధితుడు పామును వదలకుండా చేతిలోనే పట్టుకుని ఆసుపత్రి వరండాలో కింద పడిపోవడం కనిపించింది. ఇలా పామును చేత్తో పట్టుకొని ఆసుపత్రికి రావడంతో అక్కడ ఉన్నవారు అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. వైద్యులు అతడి దగ్గర పాము ఉండడంతో దగ్గరికి వచ్చి వైద్యం చేయలేకపోయారు. ఈ క్రమంలో బాధితుడి కుటుంబ సభ్యులు, నర్సింగ్ సిబ్బంది ఎలాగోలా అతి కష్టం మీద ఆ పామును ఒక సంచిలో వేసి కట్టేసి అనంతరం డాక్టర్లు ఆ వ్యక్తికి వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలియజేశారు.


Similar News