మొదలైన మూడోదశ లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
మూడోదశ లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది.12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 నియోజకవర్గాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు
దిశ, నేషనల్ బ్యూరో: మూడోదశ లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది.12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 నియోజకవర్గాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 19. పోలింగ్ మే 7న ఉంటుంది. మూడో దశలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు.. అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, దాద్రా & నగర్ హవేలీ, డామన్- డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూ & కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్. నామినేషన్ల పరిశీలన తేదీ ఏప్రిల్ 20. అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 22.
మధ్యప్రదేశ్‌లోని బేతుల్ నియోజకవర్గంలో ఓటింగ్ ఏప్రిల్ 26న రెండవ దశలో నిర్వహించాల్సి ఉంది. అయితే BSP అభ్యర్థి మరణించడంతో బేతుల్ లోక్‌సభ స్థానం ఎన్నికను వాయిదా వేశారు. దీనికోసం కూడా విడిగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పటికే తొలిదశ, రెండో దశకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. శుక్రవారం మూడో దశ కూడా మొదలైంది.18వ లోక్‌సభను ఎన్నుకునేందుకు ఏడు దశల ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.