Doctors : వైద్యులు తక్షణం విధుల్లోకి తిరిగి చేరండి: Supreme Court
కోల్‌కతా హత్యాచార ఘటనపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు వైద్యులకు కీలక సూచనలు చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా హత్యాచార ఘటనపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు వైద్యులకు కీలక సూచనలు చేసింది. నిరసన తెలుపుతున్న వైద్యులు దానిని విరమించి తక్షణం విధుల్లోకి చేరాలని గురువారం పేర్కొంది. తిరిగి విధుల్లోకి చేరిన తర్వాత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఆందోళనల కారణంగా వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. అనారోగ్యంతో ఆసుపత్రులకు వచ్చే వారి గురించి ఆలోచించండి, వైద్యులు పని చేయకపోతే ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు ఎలా నడుస్తాయి అని న్యాయమూర్తి అన్నారు. ఇదిలా ఉంటే ఈ కేసుపై విచారణలో భాగంగా సీబీఐ తన స్టేటస్ రిపోర్ట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించింది. తన రిపోర్ట్‌లో కోల్‌కతా పోలీసుల నిర్లక్ష్యాన్ని వెల్లడించింది. మొదట ఆమెది ఆత్మహత్య అని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని సీబీఐ తన రిపోర్ట్‌లో తెలిపింది.