'ది కేరళ స్టోరీ’ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు
'ది కేరళ స్టోరీ’ సినిమా విషయంలో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: 'ది కేరళ స్టోరీ’ సినిమా విషయంలో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. పశ్చిమ బెంగాల్ లో ఈ చిత్ర ప్రదర్శనపై బ్యాన్ విధించడానికి సరైన కారణం ఏంటో తమకు కనిపించడం లేదని సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. దేశ మంతటా ఈ సినిమా ప్రదర్శన జరుగుతోంది. దేశంలోని ఏ ఇతర ప్రాంతం కంటే వెస్ట్ బెంగాల్ భిన్నం కాదు. అలాంటప్పుడు మిగతా ప్రాంతాల్లో సినిమా ప్రదర్శిస్తుంటే ఒక్క పశ్చిమ బెంగాల్ లోనే నిషేధం విధించడాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు మమతా సర్కార్ కు నోటీసులు జారీ చేసింది.
అలాగే ఈ సినిమా విషయంలో తమిళనాడు సర్కార్ కు సైతం సుప్రీం నోటీసులు జారీ చేసింది. తమిళనాడు ప్రభుత్వం ఈ చిత్రంపై బ్యాన్ విధించనప్పటికీ శాంతి భద్రతల కారణాలతో సినిమా ప్రదర్శన నిలిపివేస్తున్నట్లు తమిళనాడులోని థియేటర్ యజమానులు ప్రకటించారు. దీనిపై మూవీ మేకర్స్ సుప్రీంను ఆశ్రయిచగా థియేటర్ల వద్ద తీసుకున్న భద్రతా చర్యలపై వివరణ ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.