CM Adityanath : ప్రతీ భారతీయుడు ‘ది సబర్మతీ రిపోర్ట్’ చూడాలి
దిశ, నేషనల్ బ్యూరో : బాలీవుడ్ మూవీ ‘ది సబర్మతీ రిపోర్ట్’(The Sabarmati Report)కు పన్ను మినహాయింపుపై బీజేపీ పాలిత రాష్ట్రాలు ఒకదాని తర్వాత ఒకటిగా ప్రకటనలు విడుదల చేస్తున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో : బాలీవుడ్ మూవీ ‘ది సబర్మతీ రిపోర్ట్’(The Sabarmati Report)కు పన్ను మినహాయింపుపై బీజేపీ పాలిత రాష్ట్రాలు ఒకదాని తర్వాత ఒకటిగా ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే హర్యానా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లు ఆ సినిమాను తమ రాష్ట్రాల్లో ‘ట్యాక్స్ ఫ్రీ’గా ప్రకటించాయి. తాజాగా గురువారం రోజు ఈ లిస్టులో ఉత్తరప్రదేశ్(UP) కూడా చేరింది. ‘ది సబర్మతీ రిపోర్ట్’కు పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్(CM Adityanath) వెల్లడించారు. 2002లో గుజరాత్‌లోని గోద్రాలో జరిగిన రైలు ఉదంతానికి సంబంధించిన వాస్తవాలను ఈ సినిమాలో చక్కగా చూపించారని ఆయన కొనియాడారు.
ప్రతీ భారతీయుడు ఈ సినిమాను చూడాలని కోరారు. ప్రభుత్వాలను దెబ్బతీసేందుకు, రాజకీయ సుస్థిరతకు విఘాతం కలిగించేందుకు ఆనాడు అలాంటి దారుణాలకు కొందరు పాల్పడ్డారని యోగి చెప్పారు. ‘‘రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రలు చేసే వారి వివరాలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉంది. ది సబర్మతీ రిపోర్ట్ మూవీని తీసిన వారు అలాంటి నిజాలను బయటపెట్టారు’’ అని సీఎం కితాబిచ్చారు. అంతకుముందు లక్నోలోని ఒక థియేటర్‌లో కొంతమంది రాష్ట్ర మంత్రులతో కలిసి సీఎం యోగి ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌ను వీక్షించారు. సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన విక్రాంత్ మస్సీ సహా పలువురు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.