లోక్‌సభ ఎన్నికల్లో సినీ ప్రముఖులు.. గెలిచారా.. ఓడారా..?

2024 లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న తరుణంలో ఈ ఎన్నికల్లో చాలా మంది సినిమా సెలబ్రిటీలు పోటీ చేశారు

Update: 2024-06-04 10:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: 2024 లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న తరుణంలో ఈ ఎన్నికల్లో చాలా మంది సినిమా సెలబ్రిటీలు పోటీ చేశారు. వారిలో కొంతమంది కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వారు కూడా ఉన్నారు. ఫలితాల్లో కొందరు తమ ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉండగా, మరికొందరు వెనుకబడి ఉన్నారు, అయితే వారి ప్రస్తుత పరిస్థితి ఎన్నికల ఫలితాల్లో ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

బీజేపీ తరపున ప్రముఖ నటి కంగనా రనౌత్ - మండి లోక్‌సభ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో పోటీకి దిగారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్‌లో కంగనా ముందంజలో ఉన్నారు.

ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా - బెంగాల్‌లోని అసన్‌సోల్‌ నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఆయన తన సమీప ప్రత్యర్థి కంటే 62,264 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

నటి హేమమాలిని మథుర నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఆమె 2014, 2019లో మథుర నుండి ఎన్నికయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ దంగర్, BSP అభ్యర్థి సురేష్ సింగ్‌తో పోటీ పడ్డారు. ఈ ఫలితాల్లో హేమమాలిని ప్రస్తుతం 1 లక్షా 94 వేల 326 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

నటుడు, రాజకీయ, బీజేపీ అభ్యర్థి మనోర్ తివారీ ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌కు చెందిన కన్హయ్య కుమార్‌పై పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ముందంజలో ఉన్నారు.

నటుడు రవి కిషన్ గోరఖ్‌పూర్ నుండి బీజేపీ తరపున పోటీ చేయగా, ఈ ఫలితాల్లో ఆయన లీడ్‌‌లో ఉన్నారు.

రామాయణం అనే టీవీ సిరీస్‌లో రాముడి పాత్రకు పేరుగాంచిన నటుడు అరుణ్ గోవిల్ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుండి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఈ ఫలితాల్లో ఆయన తన ప్రత్యర్థి కంటే వెనుకంజలో ఉన్నారు.

నటుడు పవన్ సింగ్ బీహార్‌లోని కరకత్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వెనుకంజలో ఉన్నారు.

నటుడు దినేష్ లాల్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ నుండి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. అయితే ఈ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ధర్మేంద్ర యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం స్థానంలో 70 వేలకు పైగా ఓట్లతో గెలిచారు. మలయాళ నటుడు సురేష్ గోపి త్రిసూర్ నుంచి పోటీ చేస్తుండగా, తన ప్రత్యర్థిపై 73,573 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు .


Similar News