Gangster arrest: అభిమానుల అత్యుత్సాహంతో తిరిగి జైలుకు వెళ్లిన గ్యాంగ్‌స్టర్
ఇటీవల జైలు నుంచి విడుదలైన ఒక గ్యాంగ్‌స్టర్‌కు అతని అభిమానులు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పడానికి కారు, బైక్‌లతో ర్యాలీ నిర్వహించడంతో పోలీసులు ఆ గ్యాంగ్‌స్టర్‌ను మళ్లీ అరెస్ట్ చేసి జైలుకు పంపిన ఘటన తాజాగా చోటు చేసుకుంది
దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల జైలు నుంచి విడుదలైన ఒక గ్యాంగ్‌స్టర్‌కు అతని అభిమానులు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పడానికి కారు, బైక్‌లతో ర్యాలీ నిర్వహించడంతో పోలీసులు ఆ గ్యాంగ్‌స్టర్‌ను మళ్లీ అరెస్ట్ చేసి జైలుకు పంపిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. మహారాష్ట్ర నాసిక్‌లోని గ్యాంగ్‌స్టర్ హర్షద్ పట్నాకర్‌ను ఇటీవల మహారాష్ట్ర ప్రివెన్షన్ ఆప్ డేంజరస్ యాక్టివిటీస్ ఆఫ్ స్లమ్‌లార్డ్స్, బూట్‌లెగ్గర్స్, డ్రగ్స్ ఆఫెండర్ అండ్ డేంజర్ పర్సన్ యాక్ట్ (ఎంపీడీఏ) కింద అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత జులై 23న జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ క్రమంలో అతడి అభిమానులు, మద్దతుదారులు బేథల్ నగర్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో దాదాపు 15 ద్విచక్ర వాహనాలు, కార్లు పాల్గొన్నాయి.
ఆ గ్యాంగ్‌స్టర్, కారు సన్‌రూఫ్ ద్వారా నిలబడి ప్రజలకు చేతులు ఊపుతూ అభివాదం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పలువురు యూజర్లు దీనిపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. పబ్లిక్‌కు అంతరాయం కలిగించడంపై విమర్శలు వచ్చాయి. ఈ విషయం పోలీసుల వరకు చేరడంతో వెంటనే స్పందించి, గ్యాంగ్‌స్టర్‌తోపాటు ఆతని అనుచరులను ఆరుగురిని అరెస్ట్ చేసి తిరిగి జైలుకు పంపారు. ఎలాంటి అనుమతి లేకుండా ర్యాలీని నిర్వహించినందుకు, గందరగోళం సృష్టించినందుకు వారిపై హత్యయత్నం, చోరీ, హింస కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.