ఏడేళ్ల తర్వాత కొడుకును చూసిన తల్లి.. ఎంతటి దయనీయ స్థితిలో కనిపించాడో తెలుసా?
బెగ్గింగ్ గ్యాంగ్‌తో అడుక్కుంటున్న కొడుకును.. ఓ తల్లి గుర్తుపట్టిన ఘటన పాకిస్థాన్‌లోని రావల్పిండిలో చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: బెగ్గింగ్ గ్యాంగ్‌తో అడుక్కుంటున్న కొడుకును.. ఓ తల్లి గుర్తుపట్టిన ఘటన పాకిస్థాన్‌లోని రావల్పిండిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. షాహీన్ అఖ్తర్ అనే మహిళ కుమారుడు ముస్తఖీమ్ ఖలీద్ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవాడు. ఈ క్రమంలో అతడికి మతిస్థిమితం కోల్పోయి ఇంటికే పరిమితమైపోయాడు. అప్పుడప్పుడు ముస్తఖీమ్ ఇంట్లో నుంచి పారిపోతే.. స్థానికులు, ఇరుగుపొరుగు వారు గుర్తుపట్టి అతడ్ని మళ్లీ ఇంటికి తీసుకొచ్చేవారు. 2016 లో కూడా ఇలాగే అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు.
తల్లి షాహీన్ అతడి కోసం ఎంతగానో వెతికింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఫలితం లేకుండాపోయింది. అప్పటి నుంచి ఆమె ఏడేళ్లుగా వెతుకుతూనే ఉంది. తాజాగా షాహీన్.. రోడ్డుపై వెళ్తున్న ముగ్గురు బెగ్గర్స్ మరో వ్యక్తిని అడ్డుక్కోమని బలవంతపెడుతూ కనిపించారు. ఆ వ్యక్తి తన కొడుకే అని గుర్తుపట్టిన తల్లి ఒక్కసారిగా దుఃఖం, సంతోషం పొంగుకొచ్చాయి.
మాసిన దుస్తుల్లో ఉన్న కుమారుడ్ని చూసి ఆ తల్లి షాకయ్యింది. షాహీన్‌ను తన వెంట తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. దీంతో అక్కడున్న బెగ్గర్స్ ఆమెతో గొడవకు దిగారు. ఆమెపై దాడి చేసే ప్రయత్నమూ చేశారు. ఈ క్రమంలో ఆమె పోలీసులకు సమాచారం అందించడంతో ఆ గ్యాంగ్ అక్కడి నుంచి పారిపోయారు. కన్నకొడుకును జీవితంలో చూడలేనేమో అనుకున్న షాహీన్.. కుమారుడ్ని ఆ స్థితిలో చూసి గుండె పగిలేలా రోధించింది. ‘‘ముస్తఖీమ్‌ను చిత్రహింసలకు గురిచేశారు. ఇంజెక్షన్లు ఇచ్చి బలవంతంగా అడుక్కునేలా చేశారు.’’ అని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం విస్తృత గాలింపు చర్యలు చేప్టటారు. ఆ గ్యాంగ్ లీడర్‌తో పాటు పలువురు గ్యాంగ్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.