కంగనా రైతులను అగౌరపరిచారు.. అందుకే చెంపపై కొట్టా

కొత్తగా ఎంపీగా ఎన్నికైన సినీనటి కంగనా రనౌ‌త్‌కు చండీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది.

Update: 2024-06-06 13:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కొత్తగా ఎంపీగా ఎన్నికైన సినీనటి కంగనా రనౌ‌త్‌కు చండీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన తరువాత కంగనా ఢిల్లీకి వెళ్లడానికి చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకోగా అక్కడ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కానిస్టేబుల్‌ కంగనా చెంపపై కొట్టారు. ఈ ఘటనకు పాల్పడిన కానిస్టేబుల్‌ను కుల్విందర్ కౌర్‌గా గుర్తించారు. రైతులను అగౌరపరిచినందుకే కంగనాపై చేయి చేసుకున్నట్లు ఆమె చెప్పారు. ఈ ఘటనపై స్టేట్‌మెంట్ ఇచ్చిన కుల్విందర్ కౌర్‌, రైతు ఉద్యమంలో పాల్గొన్న వారు రూ. 100 తీసుకుని వచ్చారని కంగనా అంది.. ఆమె వెళ్లి అక్కడ కూర్చుంటారా? ఈ స్టేట్‌మెంట్ ఇచ్చినప్పుడు మా అమ్మ అక్కడ కూర్చుని నిరసన వ్యక్తం చేసిందని కౌర్ చెప్పారు.

దాడికి పాల్పడిన సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే కంగనా సహాయకుల్లో ఒకరు స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఢిల్లీలో విమానం దిగిన తర్వాత కంగనా విలేకరులతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆమె తన ఎక్స్ ఖాతాలో వివరించింది. నేను క్షేమంగా ఉన్నాను. సెక్యూరిటీ చెక్-ఇన్‌లో మహిళా గార్డు నన్ను కొట్టిందని తెలిపారు.

గతంలో రైతులు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధర ఇవ్వాలని దేశ రాజధాని ఢిల్లీలో 15 నెలల పాటు నిరసన చేశారు. అయితే కంగనా రైతుల ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీనిపై అప్పట్లో కంగనాపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. తాజా ఎన్నికల ప్రచారంలో, ఆమె మండి వైపు వెళుతుండగా, చండీగఢ్‌లో ఆమె కాన్వాయ్‌ను రైతులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు కూడా. అయినప్పటికీ తాజా ఎన్నికల్లో కంగనా బీజేపీ తరపున మండి నుంచి పోటీ చేసి గెలుపొందారు.


Similar News