NIA raids: ఆరు రాష్ట్రాల్లోని 22 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు.. మానవ అక్రమ రవాణా కేసులో చర్యలు
మానవ అక్రమ రవాణాకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా ఆరు రాష్ట్రాల్లోని 22 ప్రాంతాల్లో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది.
దిశ, నేషనల్ బ్యూరో: మానవ అక్రమ రవాణాకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) ఆరు రాష్ట్రాల్లోని 22 ప్రాంతాల్లో గురువారం తనిఖీలు చేపట్టింది. బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర పంజాబ్‌లలో సోదాలు చేసింది. 17 మంది అనుమానితుల ప్రాంగణాల్లో ఈ దాడులు నిర్వహించినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. నిందితులుగా అనుమానిస్తున్న వారు భారతీయ యువకులను అక్రమ రవాణా చేస్తున్న సహచరులు, బంధువులుగా గుర్తించారు. దాడుల్లో భాగంగా మొబైల్ ఫోన్లు, హార్డ్ డ్రైవ్‌లు, మెమరీ కార్డ్‌లు, ల్యాప్‌టాప్‌లు సహా అనేక డిజిటల్ పరికరాలు, ఆస్థులకు సంబంధించిన పలు పత్రాలు, 34,80,800 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతను ఆకర్షించి, బాధితులను విదేశాల్లోకి స్కామ్ కంపెనీలకు బదిలీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అంతేగాక అక్కడికి వెళ్లాక వారి పాస్‌పోర్ట్‌లను సైతం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ తరహా నెట్‌వర్క్‌పై అనుమానాలు రావడంతో బిహార్ పోలీసులు కేసును ఎన్ఐఏకి అప్పగించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్ఐఏ సోదాలు చేపట్టింది.