బస్సుపై దాడి మా పనే.. ఘటన వెనుక లష్కరే తోయిబా హస్తం!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్మూలోని దాడి వెనుక ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉందని తెలుస్తోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్మూలోని దాడి వెనుక ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉందని తెలుస్తోంది. రియాసిలో యాత్రికుల బస్సుపై దాడి చేసింది పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) తమ హస్తం ఉందని ప్రకటించింది. వైష్ణోదేవి ఆలయ సందర్శనకు వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో బస్సు లోయలో పడటంతో 10 మంది మృతి చెందగా.. మరో 33 మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. బస్సుపై కాల్పులు జరిపిన దుండగులు అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటనకు పాల్పడింది తామేనని లష్కరే తాయిబా కు చెందిన టీఆర్ఎఫ్ తాజాగా స్పష్టం చేసింది. ప్రధానిగా మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఈ ఘటన జరగడంతో దేశంలో ఒక్కసారిగా కలకలం రేపింది. గతేడాది జనవరి 6న టీఆర్ఎఫ్‌పై కేంద్రం నిషేధం విధించింది. దానిని ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్ద సమయంలో టీఆర్ఎఫ్ సంస్థ ఉనికిలోకి వచ్చింది. అయితే, ఇది పాక్‌లోని కరాచీ కేంద్రంగా పనిచేస్తున్నదని కొన్ని మీడియా కథనాలు చెబుతున్నాయి.