Terrorist: కశ్మీర్‌లో ఎన్ కౌంటర్.. లష్కరే తోయిబా ఉగ్రవాది హతం
జమ్మూ కశ్మీర్‌లోని గగాంగీర్‌లో దాడికి పాల్పడిన లష్కరే తోయిబా ఉగ్రవాది జునైద్ అహ్మద్ భట్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది అక్టోబర్‌లో జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir)లోని గగాంగీర్ (Gagamgir)లో దాడికి పాల్పడిన లష్కరే తోయిబా ఉగ్రవాది జునైద్ అహ్మద్ భట్(Junaid ahmad butt) ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కశ్మీర్‌లోని దాచిగామ్ (Dhachigam) అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జునైద్‌ను హతమార్చినట్టు జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. శ్రీనగర్ శివార్లలోని దాచిగామ్ అడవిలో ఉగ్రవాదుల ఉనికి ఉన్నట్టు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలో మంగళవారం ఉదయం కశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ (CRPF) బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో మొదటగా ఉగ్రవాదులు జవాన్లపైకి కాల్పులు జరిపారు. సైన్యం సైతం ఎదురు కాల్పులు జరపగా ఉగ్రవాది జునైద్ హతమయ్యారు. ఆ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులున్నారని సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు.
కాగా, జునైద్ లష్కరే తోయిబాకు చెందిన ఏ-కేటగిరీ ఉగ్రవాది. ఆయన గంగాంగీర్, గందర్‌బల్‌లో పౌరులను చంపడం, ఇతర ఉగ్రవాద దాడులలో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. సెంట్రల్ కశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలోని సోనామార్గ్ సమీపంలోని జెడ్-మోర్ సొరంగంపై పనిచేస్తున్న నిర్మాణ సంస్థలోని ఏడుగురు ఉద్యోగుల హత్యలో జునైద్ ప్రమేయం ఉందని తెలిపారు. అలాగే ఇతర ఉగ్రదాడుల్లోనూ పాల్గొన్నట్టు వెల్లడించారు.