India-Pakistan: ఉగ్రదేశం ప్రజాస్వామ్య దేశానికి చెప్పడమేంటో?.. పాక్ పై భారత్ విమర్శలు

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాక్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. కాగా.. పాక్ వ్యాఖ్యలను భారత దౌత్యవేత్త భవిక మంగళానందన్ తిప్పికొట్టారు.

Update: 2024-09-28 07:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాక్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. కాగా.. పాక్ వ్యాఖ్యలను భారత దౌత్యవేత్త భవిక మంగళానందన్ తిప్పికొట్టారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్‌, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ గురించి మాట్లాడటం గురించి మాట్లాడటం ఏంటో తెలియట్లేదన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మరోసారి కాశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తడాన్ని భారత్‌ తీవ్రంగా విమర్శించింది. భవిక మంగళానందన్ మాట్లాడుతూ.. ‘‘ అంతర్జాతీయ వేదికపై అసత్యాలు వింటున్నాం. పాక్ ప్రధాని భారత్ గురించి మాట్లాడటం ఆ కోవకే చెందుతుంది. పాక్‌ సుదీర్ఘకాలంగా ఉగ్రవాదాన్ని పొరుగు దేశాలపై ఆయుధంగా ఉపయోస్తోంది. అలాంటి దేశం హింస గురించి మాట్లాడటం అంటే వంచనే అవుతుంది. ఎన్నికల్లో రిగ్గింగ్‌ చేసే దేశం.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోంది. నిజం ఏంటంటే.. పాక్ భారత్ భూభాగాన్ని కోరుకుంటోంది. జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలకు అంతరాయం కలిగించేందుకు ఉగ్రవాదాన్ని వాడుకుంటుంది. మిలిటరీ సాయంతో నడుస్తూ, ఉగ్రవాదం విషయంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన పాక్‌.. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ గురించి మాట్లాడటమా’’ అని భవిక తీవ్రంగా స్పందించారు.

ఆర్టికల్ 370 పై పాక్ వ్యాఖ్యలు

ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 79వ సెషన్‌లో సాధారణ చర్చ సందర్భంగా పాక్ ప్రధాని షరీఫ్ ఆర్టికల్ 370 రద్దు గురించి మాట్లాడారు. దాదాపు 20 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో తమ దేశంలోని సమస్యలను వదిలేసిన షరీఫ్‌.. కేవలం కశ్మీర్‌ గురించే సుదీర్ఘంగా మాట్లాడారు. పాలస్తీనా ప్రజలలానే జమ్ముకశ్మీర్ ప్రజలు స్వేచ్ఛ, నిర్ణయాధికారం కోసం పోరాడుతున్నారని అన్నారు. ఆర్టికల్‌ 370 రద్దును ప్రస్తావిస్తూ.. శాంతిస్థాపన కోసం 2019 ఆగస్టులో భారత్‌ ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా చేపట్టిన చర్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. మరోవైపు, జమ్ముకశ్మీర్‌, లడక్ భారత్‌లో అంతర్భాగమని, విడదీయరాని భాగమంటూ భారత్‌ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూ వస్తోంది. కశ్మీర్‌ సమస్యను లేవనెత్తడం, భారత్‌పై అక్కసు వెల్లగక్కుకోవడం మానుకోవాలని పలుమార్లు హెచ్చరించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.


Similar News