Terror attacks: రెండేళ్ల తర్వాత శ్రీనగర్‌లో ఉగ్ర ఘటనలు.. కుట్రలో భాగమేనా?

జమ్మూ కశ్మీర్‌లో నిరంతరం ఉగ్ర ఘటనలు చోటు చేసుకుంటాయి. ఎక్కడ ఎన్ కౌంటర్ జరుగుతుందోనని అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతుంటారు.

Update: 2024-11-04 11:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌(Jammu Kashmir)లో నిరంతరం ఉగ్ర ఘటనలు చోటు చేసుకుంటాయి. ఎప్పుడు ఎక్కడ ఎన్ కౌంటర్ జరుగుతుందో, ఏ ప్రాంతంలో ఎప్పుడు బాంబు పేలుతుందోనని అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతుంటారు. ఇటీవల కాలంలో ఈ దాడులు మరింత ఎక్కువయ్యాయి. ప్రతి రోజూ ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో టెర్రిరిస్టులతో పాటు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే జమ్మూ కశ్మీర్ వేసవి రాజధాని అయిన శ్రీనగర్‌(Srinagar)లో మాత్రం రెండేళ్ల విరామం తర్వాత ఉగ్రదాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. శ్రీనగర్‌లోని టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ సమీపంలోని మార్కెట్లో ఆదివారం గ్రనేడ్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. అంతకుముందు ఈ నెల 2న ఖన్యార్ ప్రాంతంలో సైన్యం, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరగగా.. ఓ పాక్ ఉగ్రవాది హతమయ్యాడు. దీంతో గత రెండేళ్లుగా ప్రశాంతంగా ఉన్న శ్రీనగర్‌లో వరుసగా రెండు రోజుల్లో రెండు ఉగ్రదాడులు జరగడం హాట్ టాపిక్ గా మారింది.

2022 సెప్టెంబర్‌లో చివరి ఎన్‌కౌంటర్

చాలా కాలం క్రితం జీరో మిలిటెన్సీ జోన్‌(zero militancy zone)గా పరిగణించబడిన శ్రీనగర్‌లో బ్యాక్ టు బ్యాక్ టెర్రర్ ఘటనలు జరగడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఈ ప్రాంతంలో చివరి ఉగ్రఘటన 2022 సెప్టెంబర్ 15న నౌగామ్‌లో జరిగింది. ఆర్మీ జవాన్లకు, టెర్రరిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అంతకుముందు 2020లో తొమ్మిది ఎన్‌కౌంటర్లలో 21 మంది ఉగ్రవాదులు మరణించారు. ఇక, 2023, ఈ ఏడాది మొదటి 10 నెలల్లో శ్రీనగర్‌లో ఎలాంటి కాల్పులు జరగలేదు. అంతేగాక ఎన్నికల సమయంలోనూ ఎటువంటి ఘటనలు జరగకపోవడం గమనార్హం. 35 ఏళ్లలో ఎన్నికల టైంలో నాయకులు సాయంత్రం పూట కూడా ప్రచారం చేశారు.

కుట్రలో భాగమేనా?

రెండేళ్లుగా ప్రశాంతంగా ఉన్న శ్రీనగర్‌లో జరుగుతున్న వరుస ఉగ్ర ఘటనల పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కశ్మీర్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు కుట్ర చేశారని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. కశ్మీర్‌లో ఎన్నికైన ప్రభుత్వాన్ని పాకిస్థాన్ సహించలేకపోతోందని అందుకే గుల్మార్గ్, పహల్గాం ఇప్పుడు శ్రీనగర్ వంటి పర్యాటక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్టు అభిప్రాయపడుతున్నాయి. సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేందుకే ఉగ్రవాదులు రద్దీగా ఉండే ప్రాంతాలపై ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. హై అలర్ట్ ఉన్నప్పటికీ హింసాత్మక ఘటనలు జరగడం కూడా ఆందోళనకరమని పలువురు పేర్కొంటున్నారు. భద్రతా సంస్థలు, ప్రభుత్వం ఉగ్రదాడుల పట్ల సీరియస్‌గా వ్యవహరించాలని కోరుతున్నారు.  

Tags:    

Similar News