పోలింగ్ రోజు ఢిల్లీలో 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత.. ఈసీ కీలక ఆదేశాలు
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గరిష్టంగా నమోదవుతున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గరిష్టంగా నమోదవుతున్నాయి. ఈ వారం మొత్తం కూడా తీవ్రమైన వేడి గాలులు వీచే అవకాశం ఉందని తాజాగా భారత వాతావరణ విభాగం హెచ్చరిస్తుంది. ముఖ్యంగా పోలింగ్ జరిగే శనివారం రోజున ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతుందని అంచనా వేసింది. దీంతో వారం రోజుల పాటు నగరంలో 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలింగ్ రోజున ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
నగరంలోని 2,627 పోలింగ్ బూత్‌లలో ఓటర్లు వేడిని తట్టుకునేందుకు ఎయిర్ కూలర్లు, తాగునీరు, షేడ్ వెయిటింగ్ ఏరియాలతో పాటు మెడికల్ అసిస్టెంట్లు అందుబాటులో ఉంటారని ఈసీ పేర్కొంది. హీట్ వేవ్ మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో ఓటర్లు తగిన రక్షణలను పాటిస్తూ పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలని. ముఖ్యంగా మధ్యాహ్నం ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చే వారు అప్రమత్తంగా ఉండాలని ఈసీ సూచించింది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పి కృష్ణమూర్తి తెలిపారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని, సకాలంలో వాతావరణ అప్‌డేట్‌లను అందించడానికి ఈసీతో నిరంతర టచ్‌లో ఉన్నామని IMD తెలిపింది. పసిపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ముఖ్యంగా హీట్ స్ట్రోక్ లేదా వేడి-సంబంధిత అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉన్నవారు శ్రద్ధ వహించాలని వాతావరణ కార్యాలయం కోరింది. ఆదివారం, నైరుతి ఢిల్లీలోని నజాఫ్‌గఢ్‌లో గరిష్టంగా 47.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది, ఇది ఈ వేసవిలో అత్యధికం. ఢిల్లీతో పాటు పొరుగు రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్‌లు కూడా హీట్‌వేవ్ పరిస్థితులతో అల్లాడిపోతున్నాయి.