Tamil: దుకాణాల పేర్లు తమిళంలోనే ఉండాలి.. పుదుచ్చేరి సీఎం రంగస్వామి

త్రి భాషా విధానంపై కొద్ది రోజులుగా తమిళనాడులోని డీఎంకే, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Update: 2025-03-18 13:50 GMT
Tamil: దుకాణాల పేర్లు తమిళంలోనే ఉండాలి.. పుదుచ్చేరి సీఎం రంగస్వామి
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: త్రి భాషా విధానంపై కొద్ది రోజులుగా తమిళనాడులోని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి సీఎం రంగస్వామి (Ranga swamy) కీలక నిర్ణయం తీసుకున్నారు. పుదుచ్చేరిలోని అన్ని దుకాణాలు, సంస్థల పేర్లను తమిళం (Tamilam) లోనే ప్రదర్శించాలని సూచించారు. ఈ మేరకు త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలిపారు. అసెంబ్లీలో జీరో అవర్ సందర్భంగా ఎమ్మెల్యే జీ నెహ్రూ అలియాస్ కుప్పుస్వామి అడిగిన ప్రశ్నకు సీఎం సమాధానమిచ్చారు. ‘దుకాణ యజమానులు తమ షాపుల పేర్లు తమిళంలోనే ఉండేలా చూసుకోవాలి. ఈ విషయంలో సర్క్యులర్ ద్వారా కఠినమైన సూచనలు జారీ చేస్తాం’ అని తెలిపారు.

అంతేగాక ప్రభుత్వ శాఖల కార్యక్రమాలకు వచ్చే అన్ని ఆహ్వాన పత్రాల్లో తమిళ వెర్షన్ తప్పకుండా ఉండేలా ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు. తమిళ భాషను గౌరవించడానికే ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని వాణిజ్య సైన్ బోర్డులలో కనీసం 60శాతం కన్నడలో ఉండాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించిన కొన్ని నెలల తర్వాత పుదుచ్చేరి ఈ చర్యలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాత మధ్య భాషా యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో హిందీని మూడో భాషగా చేర్చాలని కేంద్రం పట్టుబడుతుండగా అందుకు తమిళనాడు ప్రభుత్వం ససేమిరా అంటోంది.

Tags:    

Similar News