Tamil Nadu: తమిళనాడులో ఎన్‌ఐఏ మెరుపు రైడ్స్.. 24 చోట్ల సోదాలు

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆదివారం ఉదయం తమిళనాడులో రైడ్స్ నిర్వహించింది.

Update: 2023-07-23 10:15 GMT

చెన్నై : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆదివారం ఉదయం తమిళనాడులో రైడ్స్ నిర్వహించింది. తంజావూరు, తిరుచ్చి, మధురై, కోయంబత్తూర్, తిరుప్పూర్, విల్లుపురం, తిరునెల్వేలి, మైలాడుతురై సహా 24 చోట్ల ఈ సోదాలు చేసింది. 2019 ఫిబ్రవరి 5న తంజావూరు జిల్లాలోని తిరువిడై మారుత్తూరులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ), సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) కార్యకర్తలు.. పట్టలి మక్కల్ కచ్చి (పీఎంకే) పార్టీ కార్యకర్త రామలింగాన్ని హత్య చేశారని ఎన్‌ఐఏ ఛార్జిషీట్ లో పేర్కొంది.

అప్పట్లో స్థానికంగా జరిగిన కొన్ని మతమార్పిడి ఘటనలను ప్రశ్నించినందుకే రామలింగాన్ని మర్డర్ చేశారని అందులో ప్రస్తావించారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకే ఎన్‌ఐఏ ఆదివారం రైడ్స్ చేసిందని సమాచారం. ఈ క్రమంలో తిరునల్వేలి జిల్లాలోని సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) తమిళనాడు రాష్ట్ర చీఫ్ ముబారక్ నివాసంలోనూ తనిఖీలు జరిపారు. రామలింగం హత్య కేసులో పరారీలో ఉన్న మిగితా ఐదుగురు నిందితుల ఆచూకీ గురించి ముబారక్ ను ఆరా తీసినట్టు తెలుస్తోంది.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)పై బ్యాన్ విధించిన తర్వాత తమిళనాడులో ఇంతకుముందు కూడా ఎన్‌ఐఏ అనేక దాడులు నిర్వహించింది. రాష్ట్రంలోని పలు సామాజిక సంస్థల బ్యానర్‌ కింద పీఎఫ్‌ఐ యాక్టివిటీస్ ను మళ్ళీ మొదలుపెట్టిందనే సమాచారం అందడంతో .. దానికి సంబంధించిన ఆధారాలను కూడగట్టడంపై ఎన్‌ఐఏ ఫోకస్ పెట్టింది. పీఎఫ్‌ఐతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఇప్పుడు ఎస్‌డీపీఐ తమిళనాడు రాష్ట్ర చీఫ్ ముబారక్ ఇంట్లో రైడ్స్ చేశారు.


Similar News