గవర్నర్ సంచలన నిర్ణయం.. సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న సర్కార్!

తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Update: 2023-06-29 16:10 GMT

చెన్నయ్: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాల కోసం నగదు కుంభకోణం సహా అనేక అవినీతి కేసుల్లో ఆరోపణలు, తీవ్రమైన క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను ఎదుర్కొంటున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలాజీ సెంథిల్‌ను మంత్రి మండలి నుంచి తొలగిస్తున్నట్టు గురువారం ప్రకటించారు. సీఎం స్టాలిన్‌తో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ మేరకు తమిళనాడు రాజ్‌భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం, ‘ఉద్యోగాలు ఇప్పించేందుకు లంచాలు తీసుకోవడం, మనీలాండరింగ్ సహా అనేక అవినీతి కేసుల్లో తీవ్రమైన క్రిమినల్ ప్రోసీడింగ్స్ ఎదుర్కొంటున్న మంత్రి సెంథిల్ బాలాజీ.. తన అధికారంతో దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎలాంటి ఆటంకం లేకుండా పారదర్శకమైన విచారణ కోసం సెంథిల్ బాలాజీని తక్షణమే మంత్రివర్గంలో నుంచి తొలగిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు’ అని ప్రకటనలో వెల్లడించారు. కాగా, మనీలాండరింగ్ కేసులో సెంథిల్ బాలాజీని నాటకీయ పరిణామాల మధ్య ఈ నెల 14న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్(ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన కస్టడీని వచ్చే నెల 12వరకు పొడిగిస్తున్నట్టు చెన్నయ్ కోర్టు మంగళవారం వెల్లడించింది. ఇప్పటికే డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య తీవ్ర విభేదాలు నెలకొనగా, అవి ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. ఇక, గవర్నర్ వివాదాస్పద నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్టు తెలుస్తోంది.


Similar News