హిందీని బలవంతంగా రుద్దుతారా..?
తమిళనాడులో భాషాభిమానం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీని బలవంతంగా తమపై రుద్దితే ముక్త కంఠంతో అక్కడి పార్టీలు వ్యతిరేకించడం తెలిసిన విషయమే.
దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులో భాషాభిమానం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీని బలవంతంగా తమపై రుద్దితే ముక్త కంఠంతో అక్కడి పార్టీలు వ్యతిరేకించడం తెలిసిన విషయమే. తాజాగా మరోసారి అక్కడ హిందీ భాషపై రచ్చ మొదలైంది. పెరుగు ప్యాకెట్లపై 'దహీ' అనే హిందీ పదం తప్పనిసరిగా ఉండాలంటూ ఇండియన్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నోటీసులు జారీ చేసింది.
పెరుగు ప్యాకెట్లపై కర్డ్ అని ఇంగ్లీష్‌లో ఉన్న స్థానంలో దహీ అనే పదం వాడాలని దాని కింద రీజనల్ లాంగ్వేజ్ పదం ఉండాలంటూ కర్ణాటక, తమిళనాడు, కేరళ డెయిరీలకు నోటీసులు వచ్చాయి. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఇదే ఆదేశాలు అమలు అయితే భాషా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. స్వంత రాష్ట్రంలో తమిళం, కన్నడ భాషలను బహిష్కరించి హిందీలో పెరుగు ప్యాకెట్ కు లేబుల్ వేయమని మమ్మల్ని నిర్దేశించే స్థాయికి చేరుకున్నారు.
ఇది మాతృభాషను నిర్లక్ష్యం చేయడమే అని ధ్వజమెత్తారు. ఇదే కంటిన్యూ అయితే దీనికి బాధ్యులైన వారు దక్షిణాది నుంచి శాశ్వతంగా బహిష్కరించబడతారని ట్విట్టర్ వేదికగా వార్నింగ్ ఇచ్చారు. ఈ అంశంపై తమిళనాడు పాల ఉత్పత్తిదారుల సంఘం సైతం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. మరోవైపు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నమలై కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ తన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని లేఖ రాశారు.
ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటిఫికేషన్ ప్రాంతీయ భాషలను ప్రోత్సహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ విధానానికి అనుగుణంగా లేదని ఆరోపించారు. అందువల్ల ఈ నోటిఫికేషన్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ సర్కార్ తో స్టాలిన్ ప్రభుత్వం అనేక విషయాలను విభేదిస్తున్న సమయంలో దహీ పదం రచ్చ తమిళనాడులో పొలిటికల్ హీట్ పెంచుతోంది.