చెన్నై: "డీఎంకే ఫైల్స్" పేరిట ఆరోపణలు చేస్తున్నందుకు రాష్ట్ర బీజేపీ చీఫ్ కె. అన్నామలైపై తమిళనాడు ప్రభుత్వం పరువు నష్టం దావా వేసింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రతిష్టను దెబ్బతీసేలా అన్నామలై మాట్లాడుతున్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాది, చెన్నై సిటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపించారు. "రాహుల్ గాంధీ చెప్పిందేమీ లేకున్నా.. ఆయన లోక్ సభ సభ్యత్వంపై కేంద్రం అనర్హత వేటు వేసింది. వాళ్లు(బీజేపీ) అలా చేయగలిగినప్పుడు.. అన్నామలైపై మేం దావా వేయడానికి ఒక సరైన కారణమంటూ ఉంది. అన్నామలై లాంటి వాళ్ళను శిక్షించాల్సిందే" అని డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఎలంగోవన్ మీడియాతో అన్నారు.
దీనిపై స్పందించిన తమిళనాడు బీజేపీ.. డీఎంకే ప్రభుత్వం వేసిన ఈ కేసుపై అన్నామలై న్యాయ పోరాటం చేస్తారని స్పష్టం చేసింది. ఇంతకుముందు కూడా ఇదే విధంగా డీఎంకే సర్కారు లీగల్ నోటీసులు పంపితే.. క్షమాపణలు చెప్పేందుకు అన్నామలై నిరాకరించారని గుర్తు చేసింది. "డీఎంకే ఫైల్స్" పేరుతో సీఎం స్టాలిన్, ఆయన కుటుంబ సభ్యులు, తమిళనాడు మంత్రులు, డీఎంకే ముఖ్య నేతలు టార్గెట్‌గా అన్నామలై ఇటీవల మీడియా సమావేశాలు నిర్వహించి మరీ వరుస ఆరోపణలు చేశారు. ఆ ఫైల్స్‌కు సంబంధించిన కొన్ని ఆడియోలను కూడా రిలీజ్ చేయడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే అన్నామలైపై తమిళనాడు ప్రభుత్వం పరువు నష్టం దావా వేసింది.
Also Read...