కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ లొల్లి

కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ నదీ జలాల వివాదం మళ్లీ మొదటికొచ్చింది. దీనిపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ మంగళవారం చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

Update: 2024-07-16 10:59 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ నదీ జలాల వివాదం మళ్లీ మొదటికొచ్చింది. దీనిపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ మంగళవారం చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కర్ణాటకతో కావేరీ నదీ జలాల వివాదంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అఖిలపక్ష భేటీ తర్వాత సీఎం స్టాలిన్‌ మీడియాతో మాట్లాడారు. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం నిరాకరించడాన్ని తప్పుబట్టారు. కర్ణాటక ప్రభుత్వ తీరుని అఖిలపక్ష సమావేశం తీవ్రంగా ఖండించిందని స్టాలిన్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేసేలా కర్ణాటకను ఆదేశించాలని సీడబ్ల్యూఎంఏని కోరినట్లు వెల్లడించారు. కాగా.. జులై 15 నాటికి కర్ణాటకలోని నాలుగు ప్రధాన రిజర్వాయర్లలో 75.586 టీఎంసీల నీరు నిల్వ ఉందని.. తమిళనాడులోని మెట్టూరు డ్యాంలో మాత్రం కేవలం 13.808 టీఎంసీల నీరు ఉందని మండిపడ్డారు.

రెండు రాష్ట్రాల మధ్య గొడవ

కావేరీ పరీవాహక ప్రాంతం నుంచి నదీ జలాలను పంచుకోవడంపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు తరచూ గొడవ పడుతున్నాయి. మరోవైపు తమిళనాడుకు ఒక టీఎంసీ నీరు విడుదల చేయాల్సి ఉండగా.. కేవలం 8000 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. బెంగళూరులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, బీజేపీ నేత సీటీ రవి, సహా రాష్ట్రానికి చెందిన ప్రముఖనేతలు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని సిద్ధరామయ్య వెల్లడించారు. తమిళనాడురు ప్రతిరోజు ఒక టీఎంసీ నీటిని వదలలేమన్నది సమిష్టి అభిప్రాయం అని ఆయన పేర్కొన్నారు. కావేరి బేసిన్ డ్యామ్‌లలో 63 శాతం నీరు మాత్రమే ఉందని.. తమిళనాడుకు ఒక టీఎంసీ నీటిని విడుదల చేసే పరిస్థితి లేదని అన్నారు.


Similar News