అయోధ్య రాముడి నుదుటిపై సూర్యతిలకం.. ఆసక్తికర విశేషాలివీ..

దిశ, నేషనల్ బ్యూరో : శ్రీరామనవమి వేళ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరంలో ఉన్న బాలరాముడి నుదుటిపై ‘సూర్య తిలకం’ ప్రసరించింది.

Update: 2024-04-17 13:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో : శ్రీరామనవమి వేళ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరంలో ఉన్న బాలరాముడి నుదుటిపై ‘సూర్య తిలకం’ ప్రసరించింది. దీన్ని చూసి యావత్ దేశంలోని భక్తజనం పరవశించిపోయారు. అధునాతన సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి నుదుటిపై తిలకంలా 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు ప్రసరించడాన్ని అందరూ ఆసక్తిగా వీక్షించారు. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలి నవమి ఇదే కావడంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తారు.

కోట్లాది మంది భారతీయుల్లానే నాకూ..

బాలరాముడి నుదుటిపై సూర్య భగవానుడు తిలకం దిద్దిన అపూర్వ దృశ్యాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. అసోంలోని నల్‌బడీలో ఎన్నికల ప్రచార సభ ముగిసిన అనంతరం హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ ఈ అపురూప ఘట్టాన్ని ప్రధాని చూశారు. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. ‘‘రామ్‌లల్లా నుదుటిపై సూర్యతిలకాన్ని చూసి తరించాను. కోట్లాది మంది భారతీయుల్లానే నాకూ ఇది ఎంతో భావోద్వేగభరిత క్షణం. అయోధ్య చరిత్రలోనే అత్యంత ఘనమైన రామనవమి ఉత్సవమిది. ఈ సూర్యతిలకం వికసిత భారతం తీసుకునే ప్రతీ సంకల్పాన్ని తన దివ్య శక్తితో మరింత ప్రకాశవంతం చేస్తుందని ఆశిస్తున్నా. ఇది మన జీవితాలకు కొత్త శక్తిని తీసుకురావాలని, కీర్తిపతాకలో మన దేశం కొత్త శిఖరాలను చేరుకునేలా నూతన స్ఫూర్తిని అందించాలని ఆకాంక్షిస్తున్నా’’ అని ప్రధాని రాసుకొచ్చారు.నల్‌బడీ సభలోనూ దీని గురించి ప్రస్తావిస్తూ.. ‘‘500 ఏళ్ల తర్వాత శ్రీరాముడు సొంతింటికి చేరుకున్నాడు. దివ్య భవ్య మందిరంలో తన పుట్టినరోజును చేసుకున్నాడు. ఆ రాముడి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉంటాయి’’ అని ప్రధాని అన్నారు.

ఎలా సాధ్యమైంది ?

మూడో అంతస్తు నుంచి ఆలయం గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపైకి సూర్యకిరణాలు ప్రసరించేలా ఏర్పాట్లు చేశారు. పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. ఆలయం శిఖర భాగంలో సూర్యకాంతిని గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపులోపలికి చేరిన కాంతి.. నేరుగా వచ్చి బాలరాముడి విగ్రహం నుదుటిపై ప్రసరించి తిలకంలా కనిపించింది. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌(ఐఐఏ) శాస్త్రవేత్తల సాయంతో కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ(సీబీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు ఆలయంలో ఈమేరకు నిర్మాణం చేశారు. ఆలయం శిఖర భాగంలో సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్దే మరో పరికరాన్ని కూడా ఉంచారు. ఇది కాంతిని గ్రహించే అద్దాన్ని 365 రోజులు స్వల్పంగా కదుపుతూ ఉంటుంది. మళ్లీ నవమి రోజు వారు అనుకున్న చోటుకు తీసుకొస్తుంది. అంతకుముందే ఏటా శ్రీరామనవమి వచ్చే కాలాన్ని సెకన్లతో సహా లెక్కలు వేశారు. ఈ లెక్కల సాయంతో సూర్యకిరణాలు ప్రసరింపజేసే పరికరాలు, వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ 19 ఏళ్లు నిరాటంకంగా పనిచేస్తుంది. ఆ తర్వాత మరోసారి సమయాన్ని సరిచేయాల్సి ఉంటుంది.

Tags:    

Similar News