స్వలింగ వివాహ తీర్పుపై రివ్యూ పిటిషన్‌ను చాంబర్‌లో విచారిస్తామన్న సుప్రీంకోర్టు
స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధంగా గుర్తించడానికి గతంలో సుప్రీంకోర్టు నిరాకరించగా, అత్యున్నత న్యాయస్థానం తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌పై బహిరంగ విచారణకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించలేదు.
దిశ, నేషనల్ బ్యూరో: స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధంగా గుర్తించడానికి గతంలో సుప్రీంకోర్టు నిరాకరించగా, అత్యున్నత న్యాయస్థానం తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌పై బహిరంగ విచారణకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించలేదు. ఈ రివ్యూ పిటిషన్‌ను ఓపెన్ కోర్టులో కాకుండా చాంబర్‌లలో విచారిస్తామని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అక్టోబర్ 17, 2023న స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు నో చెప్పడంతో, ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయగా, దీనిని జులై 10న మధ్యాహ్నం 1.30 గంటలకు భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించనుంది.
ఈ నేపథ్యంలో పిటిషన్‌ను చాంబర్లలో కాకుండా బహిరంగ కోర్టులో విచారించాలని కోరుతూ సీనియర్ న్యాయవాదులు నీరజ్ కిషన్ కౌల్, అభిషేక్ మను సింఘ్వీలు సీజేఐని కోరారు. బహిరంగ కోర్టు విచారణ ద్వారా కేసును పారదర్శకంగా, క్షుణ్ణంగా పరిశీలించడానికి వీలు కల్పిస్తుందని వారు వాదించారు. అయితే వారు చేసిన వినతికి సీజేఐ స్పందిస్తూ, బహిరంగ కోర్టు విచారణ కోసం రివ్యూ పిటిషన్‌ను ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌లోని సభ్యులందరూ జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, చాంబర్‌లలో విచారిస్తామని చెప్పారు. సాధారణంగా, రివ్యూ పిటిషన్‌ను న్యాయమూర్తులు తమ ఛాంబర్‌లలో విచారస్తారు. ఒకవేళ రివ్యూ పిటిషన్‌లో న్యాయమూర్తులు కొత్త సాక్ష్యాలను కనుగొంటే, వారు బహిరంగ కోర్టు విచారణకు అనుమతించవచ్చు.