కేంద్రానికి ‘సుప్రీం’ షాక్.. ఈడీకి కీలక ఆదేశాలు

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మరో షాక్ ఇచ్చింది.

Update: 2024-03-22 17:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మరో షాక్ ఇచ్చింది. గతేడాది అక్టోబరు 3న ఓ మనీలాండరింగ్ కేసులో ఇచ్చిన ఆదేశాలను పునస్సమీక్షించాలంటూ కేంద్ర సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. సదరు మనీలాండరింగ్ కేసులో నిందితులుగా ఉన్న గురుగ్రామ్‌కు చెందిన రియల్టీ కంపెనీ ‘ఎం3ఎం’ డైరెక్టర్లు బసంత్ బన్సాల్, పంకజ్ బన్సాల్‌ల బెయిల్ రివ్యూ పిటిషన్లను జాగ్రత్తగా అధ్యయనం చేశామని స్పష్టం చేసింది. వారి వ్యవహారంలో తాము గతంలో ఇచ్చిన ఆదేశాల్లో పునస్సమీక్ష చేయదగిన లోపాలేవీ లేవని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రానికి తేల్చి చెప్పింది. ఈ అంశంపై ఓపెన్ కోర్టు విచారణ చేయాలంటూ కేంద్ర సర్కారు చేసిన రిక్వెస్టును కూడా బెంచ్ తిరస్కరించింది. మనీలాండరింగ్ కేసుల్లో ఎవరినైనా అరెస్టు చేసేటప్పుడు తప్పకుండా సముచిత ఆధారాలు, కారణాలను కలిగి ఉండాలని ఈడీకి కోర్టు నిర్దేశించింది. ఈమేరకు మార్చి 20వ తేదీనే సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, 2023 అక్టోబరు 3న బసంత్ బన్సాల్, పంకజ్ బన్సాల్‌లకు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మనీలాండరింగ్ కేసుల విచారణలో ఈడీ ప్రతీకార ధోరణిని విడనాడాలని హితవు పలికింది. బన్సాల్ సోదరులకు బెయిల్ దొరకకుండా చేసి జైలులోనే ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

Tags:    

Similar News