Kejriwal: కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. మరికొద్ది రోజులు జైల్లోనే

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చేలా కనిపించడం లేదు. తాజాగా ఆయన దరఖాస్తు చేసుకున్న మధ్యంతర బెయిల్ పటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది

Update: 2024-08-14 08:09 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చేలా కనిపించడం లేదు. తాజాగా ఆయన దరఖాస్తు చేసుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే ఆయనకు ఈడీ అరెస్ట్ చేసిన కేసులో బెయిల్ లభించిన కూడా సీబీఐ అరెస్ట్ కేసులో బెయిల్ రాకపోవడంతో ఇంకా జైలులోనే ఉన్నారు. అంతకుముందు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ తన అరెస్టును సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్ పిటిషన్‌పై స్పందించడానికి ఆగస్టు 23 వరకు ఏజెన్సీకి గడువు ఇచ్చింది.

విచారణలో భాగంగా కేజ్రీవాల్ తరపున న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదిస్తూ, ఇప్పటికే ఈడీ కేసులో బెయిల్ లభించింది. ఆయన ఆరోగ్యం బాగాలేదు. తక్షణమే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే ఆయన వాదనలను తిరస్కరిస్తూ మేము ఎటువంటి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 17 నెలల జైలు శిక్ష తర్వాత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరైన కొద్ది రోజులకే సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఈడీ మొదటగా అరెస్ట్ చేయగా తరువాత సీబీఐ కూడా అరెస్ట్ చేసింది. అయితే ఈడీ కేసులో గత నెలలో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ సీబీఐ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఈ అరెస్టును సవాల్‌ చేస్తూ మొదట ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, కేజ్రీవాల్ అరెస్టు చట్టబద్ధమైన దేనని, సీబీఐ చర్యలలో ఎలాంటి దురుద్దేశం లేదని కోర్టు పేర్కొంది. తగిన సాక్ష్యాధారాలు సేకరించి అనుమతి పొందిన తర్వాతే అరెస్టులు జరిగాయని హైకోర్టు పేర్కొంది. దీంతో ఆయన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Tags:    

Similar News