Supreme Court: బిహార్ సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

బిహార్ సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పాట్నా హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని బిహార్ సర్కార్ పెట్టుకున్న అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించింది.

Update: 2024-07-29 09:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పాట్నా హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని బిహార్ సర్కార్ పెట్టుకున్న అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. పాట్నా హైకోర్టు తీర్పుపై స్తే ఇవ్వబోమని స్పష్టం చేసింది. ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు రిజ‌ర్వేష‌న్‌ను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ గ‌తేడాది నితీశ్ సర్కారు చట్టాన్ని తయారు చేసింది. అయితే, దాన్ని వ్యతిరేస్తూ హైకోర్టుని ఆశ్రయించడంతో.. 65 శాతం కోటాను పాట్నా హైకోర్టు కొట్టివేసింది. సీజేఐ జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో విచారణ చేపట్టింది. 65 శాతం కోటాపై తాత్కాలిక ఆదేశాలు ఏమీ ఉండ‌వ‌ని పేర్కొంది. సెప్టెంబర్ లోగా ఈ కేసుపై తుది విచారణ స్వీకరిస్తామని వెల్లడించింది.

పాట్నా కోర్టు ఏమందంటే?

ఉద్యోగం, విద్య అంశాల్లో స‌మాన‌త్వ హ‌క్కును బిహార్ స‌ర్కారు ఉల్లంఘించింద‌ని కొందరు హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో ఈ ఏడాది జూన్ 20న హైకోర్టు 65 శాతం కోటా చ‌ట్టాన్ని నిలిపివేసింది. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 14, 15, 16 అతిక్ర‌మించిన‌ట్లు అవుతుంద‌ని హైకోర్టు తెలిపింది. బిహార్ సర్కార్ తీరు వల్ల మెరిట్ క్యాటగిరీలో కోటా 35 శాతానికి తగ్గింది. రిజర్వేషన్ ఆధారంగా బీసీలే ఎక్కువ ఉద్యోగాలు పొందినట్లు ఓ సర్వే రిపోర్టుని హైకోర్టు అంగీకరించింది. అందుకే రిజ‌ర్వేష‌న్ అంశంపై పున‌రాలోచించాల‌ని హైకోర్టు త‌న తీర్పులో చెప్పింది.


Similar News