కుల ధృవీకరణ కేసులో బీజేపీ ఎంపీ నవనీత్ రాణాకు పెద్ద ఉపశమనం
మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ బీజేపీకి చెందిన నవనీత్ రాణాకు కుల ధృవీకరణ కేసులో పెద్ద ఉపశమనం లభించింది
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ బీజేపీకి చెందిన నవనీత్ రాణాకు కుల ధృవీకరణ కేసులో పెద్ద ఉపశమనం లభించింది. ఆమె ఎస్సీ సర్టిఫికేట్‌ను చట్టవిరుద్ధంగా పొందారని దాన్ని బాంబే హైకోర్టు రద్దు చేయడంతో దీనిని ఆమె సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు గురువారం బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది, ఆమె షెడ్యూల్డ్ కుల ధృవీకరణ పత్రాన్ని సమర్థించింది. రాణా కుల ధృవీకరణ పత్రం విషయంలో స్క్రూటినీ కమిటీ నివేదికపై హైకోర్టు జోక్యం చేసుకోరాదని న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా ప్రముఖ మీడియాతో మాట్లాడిన ఆమె నా పుట్టుకపై ప్రశ్నలు వేసిన వారికి ఈ రోజు సమాధానం దొరికింది. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు. సత్యం ఎప్పుడూ గెలుస్తుందని అన్నారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు షెడ్యూల్డ్ కుల ధృవీకరణ పత్రాలను అక్రమంగా పొందారని రాణాపై ఆరోపణలు వచ్చాయి. జూన్ 8, 2021న, ఆమె తప్పుడు పత్రాలను ఉపయోగించి 'మోచి' కుల ధృవీకరణ పత్రాన్ని మోసపూరితంగా పొందారని హైకోర్టు పేర్కొంది. 'సిక్కు-చామర్' కులానికి చెందినదిగా రికార్డులు సూచిస్తున్నాయని పేర్కొంటూ ఆమెకు రూ. 2 లక్షల జరిమానా కూడా విధించింది. దీని తర్వాత రాణా సుప్రీంకోర్టుకు వెళ్లగా, తాజాగా కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.