‘నీట్‌’పై సీబీఐ, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

దిశ, నేషనల్ బ్యూరో : జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)లో అక్రమాలు జరిగాయంటూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది.

Update: 2024-06-14 19:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో : జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)లో అక్రమాలు జరిగాయంటూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. నీట్‌ - యూజీ పరీక్షలో పేపర్‌ లీక్‌, ఇతర అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని హితేన్ సింగ్ కశ్యప్ ఆశ్రయించారు. దీన్ని సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌ శుక్రవారం విచారణ జరిపింది. రాజస్థాన్‌లోని కోటాలో ఐఐటీ జేఈఈ, నీట్ కోచింగ్ తీసుకుంటున్న పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న అంశాన్ని పిటిషన్‌‌లో ప్రస్తావించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. పిటిషనర్‌ను సున్నితంగా మందలించింది. ‘‘కోటాలో ఆత్మహత్యలకు నీట్‌ యూజీ 2024 ఫలితాలతో సంబంధం లేదు. ఇలాంటి అనవసర, భావోద్వేగ వాదనలు ఇక్కడ చేయొద్దు’’ అని పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది. ఇక ఈ పిటిషన్‌పై రెండు వారాల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వీటితో పాటు సీబీఐ, బిహార్‌ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. దీనిపై తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది. నీట్‌ పరీక్షకు సంబంధించి దాఖలైన ఇతర పెండింగ్‌ పిటిషన్లతో కలిపి దీన్ని విచారిస్తామని సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. బిహార్‌లో నీట్ ప్రశ్నాపత్నం లీకైనట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బిహార్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. కాగా, ఎంబీబీఎస్, బీడీఎస్‌ ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ -యూజీ పరీక్షను నిర్వహిస్తుంటారు.

నీట్ పరీక్షార్థుల ప్రయోజనాలను పరిరక్షిస్తాం : ధర్మేంద్ర ప్రధాన్

నీట్ పరీక్షార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, పిల్లల కెరీర్‌కు ఎలాంటి ప్రమాదం రాదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలన్నీ న్యాయంగా, సమానత్వంతో పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. నీట్ పరీక్షకు సంబంధించిన వాస్తవాలు సుప్రీంకోర్టుకు తెలుసు, కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల శ్రేయస్సు కోసం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందన్నారు. ‘‘నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియ త్వరలో జరుగుతుంది. ఎలాంటి గందరగోళం లేకుండా ఈ దిశగా ముందుకు సాగడం అత్యంత కీలకం’’ అని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. కాగా, 1,563 మంది నీట్-యూజీ అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను ఎన్టీఏ గురువారం రద్దు చేసింది. గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు జూన్ 23న రీ టెస్ట్ నిర్వహించి జూన్ 30 లోపు ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించింది.


Similar News