ఎలాగైనా సరే ఆపాల్సిందే.. ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీం సీరియస్
ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి కారణం అవుతున్న పంట వ్యర్థాల దహనాన్ని వెంటనే ఆపాలని పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రతియేటా దేశ రాజధానిని కాలుష్య కాసారంగా తయారు చేయడం సరికాదని ఈ సమస్యకు పరిష్కారమే లేదా? ఇది మీకు పట్టదా అని తప్పుబట్టింది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి కారణం అవుతున్న పంట వ్యర్థాల దహనాన్ని వెంటనే ఆపాలని పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రతియేటా దేశ రాజధానిని కాలుష్య కాసారంగా తయారు చేయడం సరికాదని ఈ సమస్యకు పరిష్కారమే లేదా? ఇది మీకు పట్టదా అని తప్పుబట్టింది. ఢిల్లీ వాయు కాలుష్యం నివారణకు తగిన ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. వాయు కాలుష్య స్థాయి రోజు రోజుకు పెరిగిపోతుంటే పంట వ్యర్థాల దహనం ఇంకా కొనసాగుతూనే ఉందని వీటి నివారణ అంతా కాగితాలకే పరిమితం అవుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయం రాజకీయ యుద్ధం కాకూడదని సూచించింది.
తక్షణమే పంటల వ్యర్థాల దహనాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పంట వ్యర్థాల దగ్ధాన్ని ఆపే చర్యలపై చర్చించేందుకు యూపీ, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాలతో కేంద్రం బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. ‘పంట వ్యర్థాల దగ్ధం ఆగాలి. దీనిని ఎలా ఆపుతారో మాకు సంబంధం లేదు. కానీ తక్షణం ఆగాలి అని, కాలుష్యం కోరల్లో చిక్కుకుని మనుషులు చనిపోవడానికి మేము అనుమతించలేం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే న్యాయస్థానాలు విధానపరమైన నిర్ణయాల్లోకి ప్రవేశించవలసి వస్తుందని స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న సరి బేసి విధానం కేవలం ఒక ప్రత్యామ్నాయం మాత్రమేనన్న సర్వోన్నత న్యాయస్థానం ఇది ఎప్పుడైనా విజయం సాధించిందా అని ప్రశ్నించిన న్యాయస్థానం తదుపరి విచారణ నవంబర్ 10కి వాయిదా వేసింది.