దేశంలో నియంత నిరంకుశత్వం.. కేజ్రీవాల్‌ను చంపేందుకు కుట్ర : సునీత

దిశ, నేషనల్ బ్యూరో : తిహార్ జైలులో తన భర్తను చంపేందుకు కుట్రపన్నారని, అందుకే ఆయనకు నెలరోజులుగా ఇన్సులిన్ ఇవ్వడం లేదని అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ ఆరోపించారు.

Update: 2024-04-21 12:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో : తిహార్ జైలులో తన భర్తను చంపేందుకు కుట్రపన్నారని, అందుకే ఆయనకు నెలరోజులుగా ఇన్సులిన్ ఇవ్వడం లేదని అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ ఆరోపించారు. ‘‘గత 12 ఏళ్లుగా నా భర్త రోజూ 50 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటున్నారు. ఆయనకు ఇన్సులిన్ ఇవ్వడానికి జైలు అధికారులు ఎందుకు నిరాకరిస్తున్నారో అర్థం కావడం లేదు’’ అని ఆమె పేర్కొన్నారు. దేశంలో నియంత పాలన సాగుతోందని.. అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ లాంటి ప్రజా నాయకులను కటాకటాల్లోకి నెట్టడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందని సునీత మండిపడ్డారు. జార్ఖండ్‌ రాజధాని రాంచీలో జరిగిన విపక్ష ఇండియా కూటమి ‘ఉల్గులన్ న్యాయ్’ ర్యాలీలో సునీతా కేజ్రీవాల్ మాట్లాడారు. ‘‘తిహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్‌పై భారీ నిఘా పెట్టారు. ఆయన తినే ప్రతి అన్నం ముద్దను నిశితంగా కెమెరాలతో పరిశీలిస్తున్నారు’’ అని ఆమె పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా సీఎం స్థాయిలో ఉన్నవాళ్లను అరెస్టు చేయడం నియంతృత్వం కాక మరేమిటని సునీతా కేజ్రీవాల్ ప్రశ్నించారు.

‘‘కేజ్రీవాల్‌ ఐఐటీయన్‌. ఆయన తలుచుకుంటే విదేశాలకు వెళ్లి బాాగా సంపాదించి సెటిల్ అయ్యేవారు. కానీ దేశంపై ప్రేమతో కేజ్రీవాల్ రాజకీయాల వైపు వచ్చారు. దేశభక్తితో దేశ ప్రజల సేవకు అంకితం కావడమే నా భర్త చేసిన తప్పా ? ’’ అని సునీత ప్రశ్నించారు. ‘‘దేశానికి సేవచేయడం ఒక్కటే కేజ్రీవాల్ లక్ష్యం. మరే కోరికా ఆయనకు లేదు. కేజ్రీవాల్ సింహం. జైలులో ఉన్నా ఆయన దేశం గురించే ఆలోచిస్తారు. జైలు తాళాలు విరుగుతాయి. అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ విడుదలవుతారు’’ అని ఆమె ఉద్వేగంగా చెప్పుకొచ్చారు. కాగా, ఈ ర్యాలీలో ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రధాని మోడీ అవినీతి గురించి మాట్లాడుతుంటే.. ఒసామా బిన్‌ లాడెన్‌, గబ్బర్‌సింగ్‌‌లు అహింసను ప్రబోధిస్తున్నట్లుగా కనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘మన దేశంలో ప్రధాని మోడీ వాషింగ్ పౌడర్‌లా మారిపోయారు. ఆయనతో కలిసిపోయిన వాళ్ల అవినీతి మురికి అంతా వదిలిపోతోంది’’ అని పేర్కొన్నారు.

Tags:    

Similar News