ఎయిర్ టెల్ అధిపతి సునీల్ మిట్టల్‌కు ‘హానరరీ నైట్ హుడ్’‌

దిశ, నేషనల్ బ్యూరో : భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్‌పర్సన్ సునీల్ భారతి మిట్టల్‌కు అరుదైన గౌరవం లభించింది.

Update: 2024-02-28 12:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో : భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్‌పర్సన్ సునీల్ భారతి మిట్టల్‌కు అరుదైన గౌరవం లభించింది. బ్రిటీష్ రాజకుటుంబం అందించే అత్యున్నత పౌర పురస్కారాల్లో అతిపెద్దదైన ‘హానరరీ నైట్ హుడ్’‌కు సునీల్‌‌ను ఎంపిక చేశారు. ఈ పురస్కారాన్ని స్వయంగా కింగ్ చార్లెస్ III ఆయనకు ప్రదానం చేయనున్నారు. దీంతో కింగ్ చార్లెస్ నుంచి నైట్ హుడ్ అందుకున్న తొలి భారతీయుడిగా మిట్టల్ రికార్డులకు ఎక్కనున్నారు. ఇంతకుముందు బ్రిటీష్ రాజకుటుంబం అందించే రెండో అతిపెద్ద పురస్కారం ‘నైట్ కమాండర్’‌ను సునీల్ మిట్టల్ అందుకున్నారు. తనకు ‘హానరరీ నైట్ హుడ్’‌ ప్రకటించిన సందర్భంగా కింగ్ ఛార్లెస్‌కు ధన్యవాదాలు తెలుపుతూ మిట్టల్ ఓ సందేశాన్ని విడుదల చేశారు. బ్రిటన్, భారత్ కలిసికట్టుగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నాయని చెప్పారు. చారిత్రక సంబంధం కలిగిన ఇరుదేశాల మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతానికి ప్రయత్నిస్తానని తెలిపారు. భారత్‌లోకి పెట్టుబడుల ప్రవాహం జరిగేలా సహకరిస్తున్నందుకు బ్రిటన్‌కు ఆయన ధన్యవాదాలు చెప్పారు. సునీల్ భారతి మిట్టల్‌కు 2007లో భారతదేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ లభించింది. భారతదేశంలో గతేడాది చివర్లో జరిగిన జీ20 సదస్సులో ఆఫ్రికన్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్‌పై బీ20 ఇండియా యాక్షన్ కౌన్సిల్‌కు అధ్యక్షుడిగా సునీల్ మిట్టల్ వ్యవహరించారు. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్, యునెస్కో బ్రాడ్‌బ్యాండ్ కమిషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌లోనూ ఆయన కమిషనర్‌గా సేవలందిస్తున్నారు. ఇంతకుముందు ‘హానరరీ నైట్ హుడ్’‌ ‌ను అందుకున్న భారతీయుల్లో రతన్ టాటా (2009), రవి శంకర్ (2001), జంషెడ్ ఇరానీ (1997) ఉన్నారు.

బ్రిటన్‌తో సునీల్ మిట్టల్ అనుబంధం

భారతదేశం-యుకే సీఈవో ఫోరమ్‌లో సభ్యుడిగా సునీల్ మిట్టల్ ఉన్నారు. గతంలో న్యూకాజిల్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ నుంచి గౌరవ డాక్టరేట్లను ఆయన అందుకున్నారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్స్ సర్కిల్ ఆఫ్ అడ్వైజర్స్‌లో సభ్యుడిగా కూడా ఉన్నారు. లండన్ బిజినెస్ స్కూల్ గవర్నింగ్ బాడీలో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో ఇండియా అడ్వైజరీ గ్రూప్ సభ్యునిగా సునీల్ వ్యవహరించారు. సునీల్ మిట్టల్‌కు చెందిన ఎయిర్‌టెల్ ఆఫ్రికా కంపెనీ 2019లో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టయింది. ఆ స్టాక్ మార్కెట్‌లోని కీలకమైన FTSE100 ఇండెక్స్‌లో ఎయిర్‌టెల్ ఆఫ్రికా సైతం ఉంది.

Tags:    

Similar News