అరవింద్ కేజ్రీవాల్ పార్టీ 6 సంచలన హామీలు

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌ వేదికగా జరిగిన విపక్ష ‘ఇండియా’ కూటమి బహిరంగ సభలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ 6 సంచలన హామీలను ప్రకటించారు.

Update: 2024-03-31 12:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌ వేదికగా జరిగిన విపక్ష ‘ఇండియా’ కూటమి బహిరంగ సభలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ 6 సంచలన హామీలను ప్రకటించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఢిల్లీకి రాష్ట్ర హోదాను కల్పిస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూస్తామన్నారు. దేశవ్యాప్తంగా అర్హులైన పేదల ఇళ్లకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తామని ఆమె తెలిపారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా పంటలకు గిట్టుబాటు ధరను అందిస్తామన్నారు. ప్రతి గ్రామంలో అద్భుతమైన ప్రభుత్వ పాఠశాలలను నిర్మిస్తామని సునీత పేర్కొన్నారు. దేశంలోని ప్రతి గ్రామం పరిధిలో మొహల్లా క్లినిక్‌లను అందుబాటులోకి తెస్తామన్నారు. ఇవన్నీ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రాసిన లేఖలోని అంశాలని ఆమె ఈసందర్భంగా వెల్లడించారు.

దేశం గురించి ఆలోచించడానికి జైల్లో చాలా టైం దొరికింది : ఆప్ చీఫ్

“నా ప్రియమైన భారతీయులారా.. నేను ఓట్లు అడగడం లేదు. ఎన్నికల్లో నన్ను గెలిపించాలని కోరడం లేదు. ఎవరినీ ఓడించడం గురించి మాట్లాడడం లేదు. భారతదేశాన్ని నవభారతంగా మార్చడం గురించి మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు జైల్లో ఉన్నాను. ఇక్కడ నాకు దేశం గురించి ఆలోచించడానికి చాలా టైం దొరికింది. భారతమాత ప్రస్తుతం బాధల్లో ఉంది. పేదలకు మంచి చదువులు అందడం లేదు. సరైన వైద్యం అందడంలేదు. కరెంటు కోతలు వెంటాడుతున్నాయి. రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిని మార్చాల్సింది దేశ ప్రజలే. ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో దోహదపడాలని 140 కోట్ల మంది భారతీయులను అడుగుతున్నా’’ అని అరవింద్ కేజ్రీవాల్ సందేశాన్ని సునీత చదివి వినిపించారు. కేజ్రీవాల్ ఒక సింహమని.. ఆయనను ఎక్కువ కాలం జైలులో బంధించి ఉంచలేరని ఆమె పేర్కొన్నారు. కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడని, నిజాయితీపరుడని కొనియాడారు.

Tags:    

Similar News