Muda case: సిద్ధరామయ్యకు కొత్త చిక్కులు.. లోకాయుక్త విచారణకు ప్రత్యేక కోర్టు ఆదేశం

కర్ణాటక రాజకీయాల్లో ముడా కుంభకోణం సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-25 09:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక రాజకీయాల్లో ముడా కుంభకోణం సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించడానికి గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతి ఇవ్వడంతో దీనిని సవాల్ చేస్తూ, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా మంగళవారం సిద్ధరామయ్య వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేయగా, తాజాగా ఆయనకు మరో కొత్త చిక్కు వచ్చి పడింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్థలం కేటాయింపు కేసులో సిద్ధరామయ్యపై కర్ణాటకలోని ప్రత్యేక కోర్టు లోకాయుక్త పోలీసుల దర్యాప్తునకు ఆదేశించింది. లోకాయుక్త మైసూరు జిల్లా పోలీసులు ముడా కుంభకోణంపై విచారణ జరిపి మూడు నెలల్లో నివేదికను సమర్పించనున్నారు.

తన భార్య పార్వతికి 14 ప్లాట్లను అక్రమంగా కేటాయించారనే ఆరోపణలపై సిద్ధరామయ్యపై విచారణ జరిపేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ మంజూరు చేసిన అనుమతిని హైకోర్టు సమర్థించిన మరుసటి రోజు అనగా బుధవారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ ఉత్తర్వులు జారీ చేశారు. సిద్ధరామయ్యపై వచ్చిన ఫిర్యాదులపై నిర్ణయాన్ని వాయిదా వేయాలని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశిస్తూ ఆగస్టు 19న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు రద్దు చేసి, విచారణకు ఆదేశించేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సీఎం సిద్ధరామయ్యకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.


Similar News