ఎన్డీయే ఏకపక్ష ధోరణి ఇక చెల్లదు : సోనియాగాంధీ

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) ఛైర్‌పర్సన్‌గా సోనియాగాంధీ తిరిగి ఎన్నికయ్యారు.

Update: 2024-06-08 18:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) ఛైర్‌పర్సన్‌గా సోనియాగాంధీ తిరిగి ఎన్నికయ్యారు. శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన సమావేశంలో తొలుత సోనియాగాంధీ పేరును కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రతిపాదించగా.. పార్టీ నేతలు గౌరవ్ గొగోయ్, తారిఖ్ అన్వర్‌ మద్దతు తెలిపారు. దీనిపై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కాంగ్రెస్ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు ఏకగ్రీవంగా ఆమోదించారు. సీపీపీ నాయకురాలిగా ఎన్నికైన తర్వాత పార్టీ ఎంపీలను ఉద్దేశించి సోనియాగాంధీ ప్రసంగించారు. ఎంపీలు పార్లమెంటులో క్రియాశీలకంగా పని చేయాలని ఆమె కోరారు. ‘‘సీపీపీ సభ్యులుగా ఎన్డీయే ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచాల్సిన బాధ్యత మనపై ఉంది. గత పదేళ్లుగా పార్లమెంటులో ఎన్డీయే సాగించిన ఏకపక్ష ధోరణి ఇకపై చెల్లదు’’ అని సోనియా పేర్కొన్నారు. గత లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ అధినేత్రిగా పనిచేసిన ఆమె మళ్లీ ఈ పదవికి ఎన్నికయ్యారు. 20ఏళ్ల పాటు లోక్‌సభ సభ్యురాలిగా ఉన్న సోనియా ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.


Similar News