'మహిళ శరీరం ఎగువ భాగాన్ని సెక్సువల్ కోణంలో చూడొద్దు'

మహిళ శరీరం ఎగువ భాగాన్ని అశ్లీల కోణంలో లేదా సెక్సువల్ కోణంలో చూడొద్దని కేరళ హైకోర్టు సూచించింది.

Update: 2023-06-05 14:30 GMT

తిరువనంతపురం: మహిళ శరీరం ఎగువ భాగాన్ని అశ్లీల కోణంలో లేదా సెక్సువల్ కోణంలో చూడొద్దని కేరళ హైకోర్టు సూచించింది. స్త్రీ, పురుషుల శరీర ఎగువ భాగాలను చూసే విషయంలో, వాటిపై అభిప్రాయాలను ఏర్పర్చుకునే విషయంలో సమాజం చూపే వ్యత్యాసంపై న్యాయస్థానం పలు ప్రశ్నలు లేవనెత్తింది. నగ్నత్వం, అశ్లీలత ఎల్లప్పుడూ పర్యాయపదాలు కావని జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ తేల్చి చెప్పారు.

పోక్సో ఆరోపణలను ఎదుర్కొంటున్న మహిళా హక్కుల కార్యకర్త రేహానా ఫాతిమాను సోమవారం నిర్దోషిగా ప్రకటించారు. రేహానా.. శరీరం ఎగువ భాగంపై తన మైనర్ పిల్లలతో పెయింటింగ్ వేయించుకున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమెపై పోక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు. "ఆ మహిళ తన శరీరాన్ని కాన్వాస్‌లా చిత్రించుకునేందుకు పిల్లలకు అనుమతినిచ్చింది. తన శరీరం గురించి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం స్త్రీ హక్కు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆమెకు ఆ స్వాతంత్ర్యం ఇస్తుంది. అది లైంగిక చర్య కాదు.. అశ్లీల చర్య కాదు" అని జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో పోక్సో ఆరోపణల నుంచి మహిళా హక్కుల కార్యకర్తను నిర్దోషిగా ప్రకటించారు. “దేశమంతటా ఉన్న పురాతన దేవాలయాలలోని కుడ్యచిత్రాలలోనూ ఇటువంటి నగ్న శిల్పాలు, పెయింటింగ్‌ లు ఉన్నాయి. వాటిని మనం కేవలం కళగా పరిగణిస్తాం. పవిత్ర భావంతో చూస్తాం. దేవతలందరి విగ్రహాలు వట్టి ఛాతీతో ఉన్నప్పటికీ ఆలయంలో ప్రార్థనలు చేస్తుంటాం. అక్కడ మనకు సెక్సువల్ భావాలు ఉండవు.. కేవలం భక్తిభావం మాత్రమే మనలో ఉంటుంది" అని కోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది.

Tags:    

Similar News