'ఆ నిరసనలకు సిద్ధు భయపడ్డారు.. నేనైతే తలొగ్గను'

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రశాంతంగా సాగుతోందని భావిస్తున్న తరుణంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.

Update: 2023-06-28 12:14 GMT

బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రశాంతంగా సాగుతోందని భావిస్తున్న తరుణంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. 2017లో కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ఉన్న టైంలో బెంగళూరులో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మించడంపై నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో సిద్ధరామయ్య ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గింది. బెంగళూరు నగర నిర్మాత కెంపెగౌడ జయంతి సందర్భంగా విధానసౌధ ప్రాంగణంలో నిర్వహించిన ప్రోగ్రాంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ దీనిపై మాట్లాడుతూ.. "గతంలో సీఎంగా సిద్ధూ ఆ ప్రాజెక్ట్‌ విషయంలో వెనకంజ వేశారు.. నైనేతే అలా భయపడేవాడ్ని కాదు.. తలొగ్గేవాణ్ని కాదు.. ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ముందుకెళ్లేవాణ్ని’’ అని కామెంట్ చేశారు. రాష్ట్రంలో ఫ్లై ఓవర్లు, టన్నెల్స్‌ను నిర్మించాలని చాలా వినతులు వస్తున్నాయని ఆయన చెప్పారు.

అయితే డీకే మాట్లాడే సందర్భంలో సీఎం సిద్ధరామయ్య లేకపోవడం గమనార్హం. ఈ వ్యాఖ్యలతో సిద్ధూ, డీకే సఖ్యత మూణ్నాళ్ల ముచ్చటేననే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాగా, డీకే వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి, మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ ఖర్గే స్పందించారు. ‘‘సిద్ధరామయ్య భయపడ్డారని నేను చెప్పను.. ప్రజల అభిప్రాయాలతో సీఎం సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు తప్పుడు కథనాలు ప్రచారంలోకి వచ్చి మంచి నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుంటుంది. డిప్యూటీ సీఎం ఆ ఉద్దేశంతోనే చెప్పారేమో’’ అని పేర్కొన్నారు.


Similar News