కర్ణాటక కొత్త సీఎంగా 'సిద్దరామయ్య..?
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని నిర్ణయించాలనే విషయంలో కాంగ్రెస్ డైలామాలో పడిపోయింది.
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని నిర్ణయించాలనే విషయంలో కాంగ్రెస్ డైలామాలో పడిపోయింది. మాజీ సీఎం సిద్దిరామయ్య, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డీకే శివకుమార్ పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో సీనియర్ నాయకుడైన సిద్దరామయ్యకే సీఎంగా ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్న నేపథ్యంలో ఎన్నికల్లో విజయం అనంతరం డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ కోసం తాను చాలా త్యాగాలు చేశానని చెప్పడంతో ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపింది. దీంతో ఎవరు సీఎంగా ఉండాలనే విషయంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఓ కమిటిని ఎర్పాటు చేశారు.
దీంతో ఎన్నికల్లో గెలుపొందిన 135 ఎమ్మెల్యేలతో ఈ కమిటీ వ్యక్తిగతంగా మాట్లాడి.. వారి అభిప్రాయాన్ని సేకరించింది. మొత్తం ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని రాతపూర్వంగా రికార్డ్ చేసిన కమిటి సీల్డ్ కవర్‌లో నివేదికను జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అందించింది. అలాగే సోమవారం రాత్రి ఆల్‌లిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఇంచార్జి రణదీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ.. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే త్వరలో ప్రకటిస్తారని తెలిపారు. దీంతో ఈ రోజు మధ్యాహ్నం సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లనున్నారు. మరికాసేపట్లో కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యనే అధికారికంగా మల్లికార్జున్ ఖర్గే ప్రకటించే అవకాశం ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.