కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. డిప్యూటీ సీఎంలుగా ముగ్గురు!
కర్ణాటక సీఎం అభ్యర్థి రేసులో సీనియర్ నేత సిద్ధరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌లు ఉన్నారు. అయితే సిద్ధరామయ్య వైపే పార్టీ అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బెంగళూరు: కర్ణాటక సీఎం అభ్యర్థి రేసులో సీనియర్ నేత సిద్ధరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌లు ఉన్నారు. అయితే సిద్ధరామయ్య వైపే పార్టీ అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్‌ను కాదని.. సిద్ధరామయ్యకే సీఎం పదవికి కట్టబెట్టేందుకు అధిష్టానం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సిద్ధరామయ్య ప్రజాదరణ పొందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఎక్కువమంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. వెనకబడిన కురుబ సామాజిక వర్గానికి చెందినవారు. అణగారిన వర్గాల అభివృద్ధి మంత్రం జపిస్తున్న కాంగ్రెస్‌కు సిద్ధరామయ్య సీఎం అయితే లోక్‌సభ ఎన్నికలకు అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందని సమాచారం.
సిద్ధరామయ్యకు సీఎం పదవి దక్కుతుందని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నప్పటికీ, డీకే శివకుమార్‌కూ అవకాశం లేకపోలేదు. అధిష్టానం ఆశీస్సులు, రాహుల్‌కు డీకేకు ఉన్న సాన్నిహిత్యం, పార్టీకి వీరవిధేయుడుగా పనిచేయడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆయనను సీఎం చేస్తారని డీకే వర్గం భావిస్తోంది. రాజస్థాన్, మహారాష్ట్రలో ఆపద సమయంలో పార్టీని ఆదుకున్నాడని డీకే శివకుమార్ ఆ పదవికి యోగ్యుడని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో కొత్తగా కొలువుదీరే కాంగ్రెస్ ప్రభుత్వంలో ముగ్గురు ఉపముఖ్యమంత్రులు కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం. ముగ్గురు డిప్యూటీ సీఎంలలో ఒకరు లింగాయత్ వర్గం వారు ఉంటారని ప్రచారం జరుగుతోంది.
Read more:
హిందూ ఏక్తా యాత్రకు సర్వం సిద్ధం.. కాషాయమయం కానున్న కరీంనగర్