Shyam Rajak: ఆర్జేడీకి భారీ షాక్.. పార్టీకి రిజైన్ చేసిన సీనియర్ నేత
రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)కి భారీ షాక్ తగిలింది. బిహార్ మాజీ మంత్రి, సీనియర్ నేత శ్యామ్ రజక్ గురువారం పార్టీకి రిజైన్ చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు పంపించారు.
దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)కి భారీ షాక్ తగిలింది. బిహార్ మాజీ మంత్రి, సీనియర్ నేత శ్యామ్ రజక్ గురువారం పార్టీకి రిజైన్ చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు పంపించారు. రాజీనామాకు గల కారణాన్ని ఆయన వెల్లడించలేదు. అయితే 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసేందుకు అవకాశం రాలేదు. ఆయన పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన స్థానంలో ఆర్జేడీ మిత్రపక్షమైన సీపీఎం లిబరేషన్ పార్టీకి సీటు కేటాయించారు. అలాగే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సమస్తి పూర్ నుంచి పోటీ చేసేందుకు పట్టుపట్టారు. కానీ ఆ స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయించారు. దీంతో వచ్చే 2025 ఎన్నికల్లోనూ ఆర్జేడీ తరఫున పోటీ చేసే అవకాశం తక్కువగా ఉండటంతో ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
కాగా, దళిత నేత అయిన రజక్ 2010-15, 2019-20మధ్య రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం రజక్ జేడీయూలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఆర్జేడీ నుంచి వైదొలిగే ముందు ఆయన సీఎం నితీశ్ కుమార్‌ను కలిసినట్టు సమాచాం. జేడీయూలో చేరాక ప్రభుత్వంలో కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ పరిణామంపై ఆర్జేడీ అధికార ప్రతినిధి చిత్తరంజన్ గగన్ స్పందించారు.ఎన్నికలకు ముందు ఇలాంటివి జరగడం సాధారణమనని తెలిపారు. ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉందని, కొంతమంది కొత్త అవకాశాల కోసం వెతుకుతున్నారని స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు.