అరెస్టయితే రాజీనామా చేయనా ? జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపనా: Arvind Kejriwal
తనను అరెస్టు చేసి జైల్లో పెట్టాలని బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు.
న్యూఢిల్లీ : తనను అరెస్టు చేసి జైల్లో పెట్టాలని బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. తాను జైలుకెళ్లినా.. ఢిల్లీలో బీజేపీ ఒక్క లోక్‌సభ సీటును కూడా గెలవలేదని కామెంట్ చేశారు. ‘‘లిక్కర్ స్కాంలో ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే పదవికి రాజీనామా చేయాలా ? జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలా ? దీనిపై ఢిల్లీ ప్రజల అభిప్రాయాన్ని సేకరించండి’’ అని ఆప్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కేజ్రీవాల్ సూచించారు. ‘‘నాకు అధికార వ్యామోహం లేదు. 49వ రోజు పదవికి రాజీనామా చేసే చరిత్ర నాకుంది’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘గతంలో నేను 15 రోజుల పాటు జైలులో ఉన్నాను.
జైల్లో ఉండటాన్ని గౌరవ ప్రదంగా భావిస్తాను. భగత్‌సింగ్ దేశం కోసం సంవత్సరాల తరబడిలో జైలులో ఉన్నారు. మనీష్ సిసోడియా ఎనిమిది నెలలుగా, సత్యేందర్ జైన్ ఏడాదిగా జైలులోనే ఉన్నారు. అలాంటప్పుడు నేను మాత్రం అరెస్ట్‌కు ఎందుకు భయపడాలి ?’’ అని ఢిల్లీ సీఎం తెలిపారు. ఆప్ కీలక నాయకులు బయట ఉంటే ఢిల్లీలో గెలవడం అసాధ్యమని గ్రహించబట్టే.. లిక్కర్ స్కాం పేరుతో కేంద్ర సర్కారు అక్రమ అరెస్టులు చేస్తోందని ఆరోపించారు. ‘‘మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లు బీజేపీలో చేరితే 24 గంటల్లో బెయిల్ వస్తుంది. మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్, హేమంత్ సోరెన్ వంటి నాయకులను కూడా అరెస్టు చేయాలని వాళ్లు ప్లాన్ చేస్తున్నారు’’ అని కేజ్రీవాల్ మండిపడ్డారు.