గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీకి షాక్: బీజేపీలో చేరిన రోహన్ గుప్తా
లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ జాతీయ అధికార ప్రతినిధి రోహన్ గుప్తా బీజేపీలో చేరారు.
దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ జాతీయ అధికార ప్రతినిధి రోహన్ గుప్తా బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో కాషాయపార్టీలో జాయిన్ అయ్యారు. కాగా, గుప్తాను అహ్మదాబాద్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే పలు కారణాల వల్ల గుప్తా ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారు. ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఓ నాయకుడి పనితీరుతో అసంతృప్తికి గురయ్యానని అందుకే కాంగ్రెస్ పార్టీకి కూడా రిజైన్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే గురువారం బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన అనంతరం గుప్తా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. దేశం పేరు ఉపయోగించి ఇండియా కూటమి ఏర్పడిందని, కానీ అందరూ దేశ వ్యతిరేక శక్తులే ఉన్నాయని ఆరోపించారు. కేజ్రీవాల్‌కు ఖలీస్థానీలతో సంబంధాలున్నాయని ఆరోపించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆయనకు ఎందుకు మద్దతిస్తుందో సమాధానం చెప్పాలన్నారు.