జార్ఖండ్‌లో బీజేపీకి షాక్: కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ ఎమ్మెల్యే

జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ వదిన, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఎమ్మెల్యే సీతా సొరేన్ బీజేపీలో చేరిన మరుసటి రోజే కాషాయ పార్టీకి షాక్ తగిలింది.

Update: 2024-03-20 09:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ వదిన, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఎమ్మెల్యే సీతా సొరేన్ బీజేపీలో చేరిన మరుసటి రోజే కాషాయ పార్టీకి షాక్ తగిలింది. జార్ఖండ్‌లోని బీజేపీ ఎమ్మెల్యే జై ప్రకాశ్ భాయ్ పటేల్ బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ గులాం అహ్మద్ మీర్, జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ ఠాకూర్, మంత్రి అలంగీర్ ఆలం, సీనియర్ నేత పవన్ ఖేరా సమక్షంలో పటేల్ హస్తం పార్టీలో చేరారు. మాండు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి జై ప్రకాశ్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇండియా కూటమిని బలోపేతం చేసేందుకు శాయశక్తులా పనిచేస్తానని తెలిపారు. తన తండ్రి టెక్ లాల్ కలలను నెరవేర్చాలని అనుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని 14లోక్ సభ స్థానాల్లో ఇండియా కూటమిని గెలిపిస్తానని వెల్లడించారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ గులాం అహ్మద్ మీర్ మాట్లాడుతూ..జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వివిధ నాయకులు కాంగ్రెస్ పార్టీలో టచ్‌లో ఉన్నట్టు తెలిపారు. పార్టీ సిద్దాంతాలు, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలకు ఆకర్షితులై పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. కాగా, జై ప్రకాశ్ ను హజారీబాగ్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగనున్నట్టు తెలుస్తోంది. జార్ఖండ్‌లో మే 13 నుంచి జూన్ 1 వరకు 4 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Tags:    

Similar News