ఆప్ నేత సంజయ్ సింగ్‌కు షాక్: ఎంపీగా ప్రమాణ స్వీకారానికి నిరాకరించిన రాజ్యసభ చైర్మన్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్‌కు షాక్ తగిలింది. సోమవారం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయాల్సి ఉండగా అందుకు సభా చైర్మన్ అనుమతివ్వలేదు.
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్‌కు షాక్ తగిలింది. సోమవారం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయాల్సి ఉండగా అందుకు సభా చైర్మన్ జగధీప్ ధన్‌ఖడ్ అనుమతివ్వలేదు. సభా ఆదేశాలను పాటించనందుకు సంజయ్‌ను గతేడాది జూలైలో రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆప్ మరోసారి రాజ్యసభకు ఆయనను నామినేట్ చేసింది. ఈ క్రమంలోనే ప్రమాణ స్వీకారం, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అందుకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సంజయ్ సింగ్‌ను సోమవారం ఉదయం 10 గంటలకు పార్లమెంటుకు తీసుకెళ్లి ప్రమాణ స్వీకారం చేయించాలని ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ జైలు అధికారులను ఆదేశించారు. అయితే రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీ సంజయ్ సింగ్‌పై నమోదైన ప్రత్యేక హక్కుల ఉల్లంఘన ఆరోపణలను విచారిస్తోంది. అందుకే ప్రమాణ స్వీకారానికి ధన్‌ఖడ్ పర్మిషన్ ఇవ్వనట్టు తెలుస్తోంది. కాగా, మనీలాండరింగ్ కేసులో గతేడాది అక్టోబర్ 4న ఈడీ సంజయ్ సింగ్‌ను అరెస్టు చేసింది.