షిండేకు షాక్..శివసేనకు కీలక నేత రాజీనామా: ఎన్సీపీ(ఎస్పీ)కి మద్దతు

లోక్ సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేకు ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ ఒత్తిడికి షిండే తలొగ్గారని ఆరోపిస్తూ శివసేనకు చెందిన కీలక నేత, రాష్ట్ర మాజీ మంత్రి సురేశ్ నవాలే పార్టీకి రాజీనామా చేశారు.

Update: 2024-04-30 08:58 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేకు ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ ఒత్తిడికి షిండే తలొగ్గారని ఆరోపిస్తూ శివసేనకు చెందిన కీలక నేత, రాష్ట్ర మాజీ మంత్రి సురేశ్ నవాలే పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం ఆయన ఓ మీడియా చానల్‌తో మాట్లాడారు. ఈ నెల 25నే శివసేనకు రాజీనామా చేసినట్టు తెలిపారు. తాను ఏ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. బీడ్ లోక్ సభ స్థానం నుంచి ఎన్సీపీ(శరద్ చంద్ర పవార్) పార్టీ నుంచి బరిలోకి దిగిన సోనావానేకి మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించారు. ‘బీజేపీ ఒత్తిడికి షిండే తలొగ్గారు. శివసేన నుంచి బయటకు వచ్చిన షిండే బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ బీజేపీకి ఒత్తిడిని ఎదిరించే ధైర్యం చేయలేదు’ అని ఆరోపించారు.

ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ) రాష్ట్రంలోని 21 స్థానాల్లో పోటీ చేస్తోందని, కానీ షిండే పార్టీలో సిట్టింగ్ ఎంపీలకు కూడా టికెట్లు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. షిండేతో చేరిన వ్యక్తుల రాజకీయ జీవితం దాదాపు ముగిసినట్టేనని స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకెలా ఉంటుందో ఆలోచించుకోవాలని తెలిపారు. పార్టీ కార్యకర్తలు మౌనంగా ఉన్నారని, ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. శివసేనను బీజేపీ మోసం చేసిందని, అందుకే బజరంగ్ సోనావానేకు మద్దతివ్వాలని తన మద్దతుదారులు సూచించినట్టు తెలిపారు. అందుకే సోనావానేకు మద్దతు ఇచ్చినట్టు వెల్లడించారు. కాగా, 2019లో అప్పటి ఉమ్మడి శివసేన మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలకు గాను 22 స్థానాల్లో పోటీ చేసి 18 స్థానాల్లో విజయం సాధించింది.

Tags:    

Similar News