Sharad pawar: మోడీ చెప్పేదొకటి చేసేదొకటి.. ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ విమర్శలు
ఒకే దేశం, ఒకే ఎన్నికలు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రకటనపై ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ విమర్శలు గుప్పించారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఒకే దేశం, ఒకే ఎన్నికలు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రకటనపై ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. మోడీ చెప్పేదానికి, చేసే పనికి పొంతన లేదని తెలిపారు. ‘మోడీ అన్ని ఎన్నికలను ఒకే సారి నిర్వహించాలని పదే పదే పట్టుబట్టారు. అయితే ఆయన ప్రసంగించిన మరుసటి రోజే మూడు రాష్ట్రాలకు వేర్వేరు ఎన్నికల తేదీలను ప్రకటించారు. ప్రధాని ఒక విషయంపై మాట్లాడుతుండగా, వ్యవస్థ మరొక నిర్ణయం తీసుకుంటుంది’ అని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన పూణేలో మీడియాతో మాట్లాడారు. తరచూ ఎన్నికలు జరగడం వల్ల దేశ ప్రగతికి అడ్డంకులు వస్తున్నాయని చెప్పిన మోడీ మూడు రాష్ట్రాల ఎన్నికలు కూడా ఒకేసారి నిర్వహించలేరా అని ప్రశ్నించారు.
మహారాష్ట్రలో విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించేందుకు కూడా డబ్బు లేదని ఆరోపించారు. ఆర్థిక భారం ఉన్నప్పటికీ కొత్త పథకాలు తీసుకొస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు శరద్ పవార్ స్పందిస్తూ..ఈ విషయం ఎన్నికల కమిషన్‌కే తెలుసని చెప్పారు. కాగా, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు దేశం ముందుకు రావాలని నొక్కి చెప్పారు. అయితే మరుసటి రోజే హర్యానా, జమ్మూ-కశ్మీర్‌లకు ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. దీంతో శరద్ మోడీపై విమర్శలు గుప్పించారు.