బీజేపీపై వ్యతిరేకత మొదలైంది.. శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జౌరంగాబాద్: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక పోల్స్ రిజల్ట్ ను బట్టి బీజేపీపై వ్యతిరేకత ప్రారంభమైందని భావిస్తున్నా అని అంటూనే.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై ప్రశంసల జల్లు కురిపించారు. "గడ్కరీ ప్రతి విషయాన్ని పార్టీ కోణంలో చూసే వ్యక్తి కాదు.. ఎవరైనా ఆయనను కలిసి ఏదైనా విషయంపై చెబితే.. ఆ వ్యక్తి నేపథ్యం గురించి కాకుండా, ఆ విషయం గురించి ఆలోచిస్తాడు.. అందులో మంచి ఉంటే అంగీకరిస్తాడు.. కేంద్ర మంత్రిగా ఆయన అంకితభావం గురించి ఎలాంటి సందేహం అక్కరలేదు" అని శరద్ పవార్ కామెంట్ చేశారు. జౌరంగాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే దేశ ప్రజల్లో మార్పు వస్తోందని అనిపిస్తోందన్నారు.
ప్రజల మనస్తత్వం ఇలాగే కొనసాగితే దేశంలో జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని జ్యోతిష్కుడిని సంప్రదించాల్సిన పనిలేదని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ప్రకటించిన తెలంగాణ మోడల్ (రైతులకు ఆర్థిక సాయం)పై శరద్ పవార్ స్పందిస్తూ.. తెలంగాణ మోడల్‌ను తాను చెక్ చేశానన్నారు. తెలంగాణ చిన్న రాష్ట్రమని, అలాంటి రాష్ట్రంలో ఇలాంటి సాయాన్ని ప్రకటించొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో విలేకరులు "నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మీకు ఇష్టమైన మంత్రి ఎవరు?" అని అడిగిన ప్రశ్నకు పవార్ బదులిస్తూ నితిన్ గడ్కరీని కొనియాడారు.