మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేతో శరద్ పవార్ భేటీ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన (షిండే వర్గం) నేత ఏక్‌నాథ్ షిండేతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ గురువారం సాయంత్రం భేటీ అయ్యారు.

Update: 2023-06-01 16:55 GMT

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన (షిండే వర్గం) నేత ఏక్‌నాథ్ షిండేతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. ముంబైలోని సీఎం అధికారిక నివాసమైన వర్షా బంగ్లాలో ఏకనాథ్ షిండేను పవార్ కలిశారు. మహారాష్ట్రలో అధికార మార్పిడి తర్వాత ఇది వారి మొదటి సమావేశం కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మీటింగ్ ఉద్దేశం ఏమిటనేది తెలియరాలేదు.

శివసేనపై ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్రలో కూలిపోయిన మహా వికాస్ అఘాడీ సంకీర్ణ సర్కారులో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా ఉన్నారు. మహా వికాస్ అఘాడీలో కీలక వ్యక్తి అయిన మాజీ ముఖ్యమంత్రి, శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత ఉద్ధవ్ థాక్రే ప్రస్తుతం మహారాష్ట్రలో లేరు. ఆయన రాష్ట్రంలో లేని టైం లో ఆకస్మికంగా జరిగిన మీటింగ్ కావడం వల్ల ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది.

మహారాష్ట్రలో పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణ అంశంపై లేదా ఎన్‌సీపీ నేతలపై ఈడీ దాడుల టాపిక్ పై ఏక్‌నాథ్ షిండే, శరద్ పవార్ చర్చించి ఉండొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక ఈ మీటింగ్ కు సంబంధించిన రెండు వీడియోలను ఏక్‌నాథ్ షిండే ట్వీట్ చేశారు.

ఈ సమావేశం ముగిసిన కొద్దిసేపటికే బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్ మాట్లాడుతూ.. ఈ భేటీ వ్యక్తిగతమని, ఇందులో వేరే అర్థం కానీ, రాజకీయం కానీ లేదని స్పష్టం చేశారు. ఉద్ధవ్ థాక్రే విదేశాల్లో ఉన్నప్పుడు ఈ సమావేశం ఎందుకు జరిగినట్లు అని మంత్రి సుధీర్ ను మీడియా ప్రశ్నించగా.. “అది పొలిటికల్ మీటింగే అయి ఉంటే దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ నా అభిప్రాయం ప్రకారం, ఇది రాజకీయ సమావేశం కాదు" అని తేల్చి చెప్పారు.

Tags:    

Similar News