భద్రతా దళాల సమాచారం లీక్!: జమ్మూ కశ్మీర్‌లో ముగ్గురి అరెస్టు
నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లాలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లాలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి మూడు గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. బారాముల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్ఈటీకి చెందిన ఒవైస్ అహ్మద్ వాజా, బాసిత్ ఫయాజ్ కలూ, ఫహీమ్ అహ్మద్ మీర్ అనే ముగ్గురు వ్యక్తులు ఉగ్రవాదులకు సహాయం చేస్తూ వారికి భద్రతా దళాల కదలికల గురించి సమాచారాన్ని అందిస్తున్నారు. దీంతో ఇంటలిజెన్స్ సమాచారం మేరకు గురువారం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరు భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు ముప్పుగా పరిణమించించే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బారాముల్లాలో శాంతి భద్రతలకు భంగం కలిగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని వెల్లడించారు. నిందితులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించారు. కాగా, గతేడాది నవంబర్‌లోనూ బారాముల్లా పోలీసులు లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు.