ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంచిన SBI !
ప్రభుత్వ రంగ అతిపెద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు శుభవార్త అందించింది.
ముంబై: ప్రభుత్వ రంగ అతిపెద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. సవరించిన రేట్లు మంగళవారం(డిసెంబర్ 13) నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇటీవల ఆర్‌బీఐ కీలక రెపో రేటును పెంచిన నేపథ్యంలో దానికి అనుగుణంగా బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ చివరిసారిగా అక్టోబర్ 22న రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 80 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది.
ప్రస్తుతం వివిధ కాలవ్యవధులను బట్టి ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్ల నుంచి 65 బేసిస్ పాయింట్ల వరకు పెరిగాయి. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ వివరాల ప్రకారం, 7-210 రోజుల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై మునుపటి వడ్డీ రేట్లనే కొనసాగించింది. 211 రోజుల నుంచి ఏడాది కాలవ్యవధి ఎఫ్‌డీలపై వడ్డీని 5.50 శాతం నుంచి 5.75 శాతానికి, 1-2 ఏళ్ల ఎఫ్‌డీలపై 6.10 శాతం నుంచి 6.75 శాతానికి, 2-3 ఏళ్ల కాలానికి 6.25 శాతం నుంచి 6.75 శాతానికి, 3-5 ఏళ్ల ఎఫ్‌డీలపై 6.10 శాతం నుంచి 6.25 శాతానికి, 5-10 ఏళ్ల డిపాజిట్లపై 6.10 శాతం నుంచి 6.25 శాతానికి పెంచుతూ ఎస్‌బీఐ నిర్ణయించింది. సీనియర్ సిటిజన్లకు పెంచిన అన్ని కాలవ్యవధులపై అదనంగా 50 బేసిస్ పాయింట్ల అధిక వడ్డీ లభిస్తుంది.
Read More...