Protest At IIT-Guwahati: ఐఐటీ గౌహతిలో విద్యార్థి మృతి.. క్యాంపస్ లో ఆందోళనలు

అసోంలోని ఐఐటీ గౌహతిలోని హాస్టల్ లో 21 ఏళ్ల విద్యార్థి విగతజీవిగా కనిపించారు. కాగా.. విద్యార్థి మృతితో మిగితా స్టూడెంట్లు అందరూ క్యాంపస్ లో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.

Update: 2024-09-10 08:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అసోంలోని ఐఐటీ గౌహతిలోని హాస్టల్ లో 21 ఏళ్ల విద్యార్థి విగతజీవిగా కనిపించారు. కాగా.. విద్యార్థి మృతితో మిగితా స్టూడెంట్లు అందరూ క్యాంపస్ లో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. విద్యార్థి చనిపోయిన విషయం తల్లిదండ్రులకు చెప్పకుండా అడ్మినిస్ట్రేషన్‌ సిబ్బంది అడ్డుకున్నట్లు మిగతా స్టూడెంట్లు ఆరోపించారు. అడ్మినిస్ట్రేషన్ కు విద్యార్థుల జీవితాలకన్నా గ్రేడులే ముఖ్యంగా మారాయంటూ మండిపడ్డారు. కాగా.. చనిపోయిన విద్యార్థి ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాడని చెబుతున్నారు. ఇకపోతే, ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లో నాల్గవ మరణం.

ఐఐటీ గౌహతి అడ్మినిస్ట్రేషన్ తీరుపై నిరసనలు

మృతదేహాన్ని గమనించిన వెంటనే హాస్టల్ గది తలుపులు బద్దలు కొట్టకుండా తమను అడ్డుకున్నారని నిరసనకారులు ఆరోపించారు. విద్యార్థి ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు చూశామని, అయినా తమను లోపలికి వెళ్లకుండా అక్కడి గార్డులు అడ్డుకున్నారని సహ విద్యార్థులు పేర్కొన్నారు. ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు చూసిన ఎనిమిది గంటల తర్వాత మృతదేహాన్ని బయటకు తీశారన్నారు. తలుపు తెరిచిన తర్వాత భద్రతా సిబ్బంది చనిపోయిన విద్యార్థి పల్స్ తనిఖీ చేయడానికి అనుమతించలేదని చెప్పారు. విద్యార్థి మృతి గురించి అతడి తల్లిదండ్రులకు సమాచారమిచ్చేందుకు ప్రయత్నిస్తే ఆపారని ఆరోపించారు. వీడియో ఎవిడెన్స్ ని తొలగించేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. ఇన్‌స్టిట్యూట్‌లో మానసిక ఆరోగ్యం, సంక్షేమ సహాయక వ్యవస్థలపై విద్యార్థులు ప్రశ్నించడంతో భారీగా ఆందోళనలు చెలరేగాయి. విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గౌహతి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. ఇక, విద్యార్థి మృతి పట్ల ఐఐటీ గౌహతి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబసభ్యులు, స్నేహితులకు సంతాపాన్ని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో మా సంస్థ విద్యార్థుల మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రాధాన్యమిస్తుందని ప్రకటనలో వెల్లడించింది.


Similar News